హక్కుల పరిరక్షణకు పోరాటాలే శరణ్యం

Dec 16,2023 07:13 #Editorial

ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల కోసం, మనుగడకోసం స్థానిక ప్రజల పోరాటాలు సాగుతున్న నేపథ్యంలో ఆందోళనకారులపై మానవ హక్కుల ఉద్యమకారులపై ప్రభుత్వాలు విరుచుకుని పడుతూనే వున్నాయి. ఇలా నిరంకుశంగా వ్యవహరించడంలో భారత ప్రభుత్వమూ తీసిపోలేదు. ప్రపంచ సంతోష సూచికలో 126వ (146 దేశాలకుగాను) స్థానంలోనూ, పత్రిక స్వేచ్ఛలో 161వ (180) స్థానంలోనూ, ప్రపంచ శాంతి సూచికలో 135వ (163) స్థానంలో, లింగ వివక్షతలో 135వ (146) స్థానంలో, ఆకలి సూచికలో 107వ (121) స్థానంలోనూ ఉన్నది.

            మార్కెట్‌పై ఆధిపత్యం కోసం జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన రూపకల్పనకు దారితీశాయి. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం, రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వజ్రోత్సవం జరుపు కుంటున్నది. అయినా ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతి రోజూ ఈ హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.బంగ్లాదేశ్‌లో సంవత్సర కాలంగా ప్రభుత్వ నిరంకుశత్వానికి, అప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛను హరించడానికి, అవినీతికి, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగాను…పారదర్శకమైన ఎన్నికల కోసం జరుగుతున్న సమ్మెలో పోరాటాలలో ముగ్గురు ఉద్యమకారులు, ఒక పోలీసు మరణించారు. ఐర్లాండ్‌లో దాదాపు దాని జనాభాలో ఒక శాతానికి సమానంగా తరలివచ్చిన శరణార్థులను బహిష్కరించడం గురించి, స్థానిక ప్రజలకు నివాసాల ఏర్పాటు గురించి ఏడాదిగా ఆందోళనలు జరుగుతున్నాయి. మరోపక్క ఆ శరణార్థుల ఆశ్రయాల కోసం కూడా ఆందోళనలు జరుగుతున్నాయి.

గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న అమానవీయ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. స్వయంగా ఇజ్రాయిల్‌ ప్రజలే యుద్ధాన్ని ఆపాలి అంటూ తమ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలిపారు. నెతన్యాహు ప్రభుత్వం ఈ ఆందోళనలు చేస్తున్న మహమ్మద్‌ బరాక్‌ లాంటి ఉద్యమకారులను అక్రమంగా నిర్బంధించింది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పత్రికలను రద్దు చేసింది.ఇలా ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల కోసం, మనుగడ కోసం స్థానిక ప్రజల పోరాటాలు సాగుతున్న నేపథ్యంలో ఆందోళనకారులపై మానవ హక్కుల ఉద్యమకారులపై ప్రభుత్వాలు విరుచుకుని పడుతూనే వున్నాయి. ఇలా నిరంకుశంగా వ్యవహరించడంలో భారత ప్రభుత్వమూ తీసిపోలేదు. ప్రపంచ సంతోష సూచికలో 126వ (146 దేశాలకుగాను) స్థానంలోనూ, పత్రిక స్వేచ్ఛలో 161వ (180) స్థానంలోనూ, ప్రపంచ శాంతి సూచికలో 135వ (163) స్థానంలో, లింగ వివక్షతలో 135వ (146) స్థానంలో, ఆకలి సూచికలో 107వ (121) స్థానంలోనూ ఉన్నది.

స్వీడన్‌కు చెందిన వీ-డెమ్‌ సంస్థ సర్వే భారతదేశాన్ని ఎన్నికల నిరంకుశత్వం గల రాజ్యంగా వర్గీకరించింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంపై అనేక కోణాల నుండి ఆంక్షలు విధించబడుతున్నాయి. కొన్ని ప్రజా సమూహాలకు వాక్‌ స్వాతంత్య్రం కరువవుతున్నది. మత రాజకీయాలు, కుల రాజకీయాలు పెరుగుతున్నాయి. భిన్నాభిప్రాయంపై దాడులు జరుగుతున్నాయి.

జాతీయ హింస వ్యతిరేక ప్రచార సంస్థ (ఎన్‌సిఎటి) 2020 జూన్‌ 29లో ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం 2019లో రోజుకు ఐదుగురు చొప్పున 1731 పోలీస్‌ కస్టడీ మరణాలు సంభవించాయి. వీరంతా దుర్బలమైన వారు, దళితులు, ముస్లింలు మరియు ఆదివాసీలు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ సందర్భంలో 2020లో జాతీయ క్రైమ్‌ రిపోర్ట్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకారం మతపరమైన అల్లర్లలో 62 మంది చనిపోయారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై ఉప చట్టంతో దేశద్రోహం కేసులు పెట్టడం, వారి నివాస ప్రాంతాలను, దుకాణాలను, ఆస్థులను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం చూశాం. 2023 మే 3న మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో 175 మంది మరణించారు. 118 మంది గాయపడ్డారు. ఈ మారణకాండలో మైనారిటీ జాతికి చెందిన మహిళలను నగంగా ఊరేగించి, బలాత్కరించి, హత్యచేశారు. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 1044 మంది (790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు) చనిపోయారు. ఈ మారణకాండలో మానవ హక్కులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించినందుకుగాను తీస్తా సెతల్వాద్‌ కేసులు, నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు.

గిరిజనుల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం గళమెత్తిన స్టాన్‌స్వామినీ అక్రమ కేసులతో ప్రభుత్వం నిర్బంధించి… జైల్లోనే ఆయన మరణానికి కారణమైంది. కులాంతర వివాహాలను ప్రోత్సహించిన ఉద్యమకారుడు గోవింద్‌ పన్సారే, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నరేంద్ర దభోల్కర్‌, కుల వ్యవస్థను ధిక్కరించిన గౌరీ లంకేష్‌లు నిర్దాక్షిణ్యంగా కాల్చబడ్డారు. హత్రాస్‌ కేసులో నిజానిజాలు బయటకు తేవడానికి ప్రయత్నించిన పాత్రికే యుడు సిద్ధిఖ్‌ కప్పన్‌పై యు.పి ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టడం తో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. డిజిటల్‌ మీడియా సంస్థ న్యూస్‌క్లిక్‌ పై దాడి, దాని వ్యవస్థాపక సంపాదకులు ప్రబీర్‌ పురకాయస్థ అరెస్టు, ఇలా అనేక నిర్బంధాల ఉదాహరణలు చూడవచ్చు.ఈ విధంగా భారతదేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై నిర్బంధాలను ప్రయోగించడంలో రాజ్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నది. పోరాటం జరుగుతున్న ప్రాంతాలను చీకటి మయం, చేస్తూ ప్రపంచానికి ఏమీ తెలియకుండా దూరం చేసి, ఇంటర్నెట్లు, విద్యుత్తు ఆపివేసి, మీడియాని నియంత్రించి, అన్ని రకాల నిర్బంధాలను ప్రయోగిస్తున్నది. మానవ హక్కుల హననం ఏ విధంగా జరుగుతున్నదో పైఉదంతాలు తెలియజేస్తున్నాయి.

మానవ జీవితం పవిత్రమైనదని చెప్తున్నప్పటికీ…ఒక్కో మతంలో ఒక్కో రకమైన విశ్వాసాలు ఉన్నాయి. ఈ మానవ జీవితాన్ని సంపూర్ణంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఆధునిక మానవ హక్కులు మానవతావాదంతోనే కాపాడబడతాయి. గతంలో కొందరికే ఉన్న ఓటు హక్కు, ఆస్తి హక్కు పోరాటాలతోనే అందరికీ అందాయి. యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయిన వారి తల్లులు, భార్యలు, ఆడపడుచుల ఒత్తిడి, ఉద్యమాల కారణంగా శాంతి ఒప్పందాలు చేసుకోవలసి వచ్చింది. తన ఆయుధాలను అమ్ముకోవడానికి యుద్ధాలను ప్రేరేపిస్తున్న సామ్రాజ్యవాద అమెరికాను ప్రపంచం దోషిగా చూస్తున్న సమయంలో, దానికి తల వంచుతున్న దేశాలను కూడా ప్రపంచ ప్రజలు పోరాటాలతో ప్రశ్నించాలి. ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాల కోసం మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న వారిని వెలివేయాలి. హక్కుల సాధనకు, పరిరక్షణకు పోరాటాలే శరణ్యమని చరిత్ర చెప్తోంది మరి.

/యుటిఎఫ్‌, గుంటూరు/ యం.డి.షకీల బేగం
/యుటిఎఫ్‌, గుంటూరు/ యం.డి.షకీల బేగం
➡️