సిఎఎ రద్దు కోసం పోరు కొనసాగుతుంది-సిపిఐ(ఎం) పునరుద్ఘాటన

Mar 12,2024 22:36 #CAA, #CPIM

న్యూఢిల్లీ : వినాశకరమైన పౌరసత్వ చట్ట సవరణ (సిఎఎ)ను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగుతుందని సిపిఐ(ఎం) పునరుద్ఘాటించింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో మంగళవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. సిఎఎ చట్టాన్ని ప్రవేశపెట్టడాన్ని, ఆ చట్టం అమలును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పొలిట్‌బ్యూరో పేర్కొంది. పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా ఈ చట్టం రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరసత్వ లౌకిక సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని అది వ్యాఖ్యానించింది. ఈ చట్టం కింద నోటిఫై చేసిన నిబంధనలు ఆచరణలో పొరుగు దేశాల నుండి వచ్చిన ముస్లింల పట్ల వివక్షాపూరిత వైఖరిని అనుసరించనున్నాయి. పైగా ఈ చట్టం అమలును జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి) ఏర్పాటుతో ముడిపెట్టడాన్ని బట్టి చూస్తే ఈ నిబంధనలు ముస్లిం సంతతికి చెందిన పౌరులను లక్ష్యంగా చేసుకుంటారనే భయాందోళనలు రేకెత్తించేవిగా ఉన్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. తమ రాష్ట్రాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులను గుర్తించడం, వారి పేర్లను నమోదు చేసుకోవడం వంటి ప్రక్రియ నుండి రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా మినహాయించేలా ఈ నిబంధనలను రూపొందించారని, సిఎఎను తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించేందుకే ఇదంతా చేస్తోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.

సిఎఎను ఆమోదించి నాలుగేళ్ళకు పైగా గడిచిన తర్వాత, అందునా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి కొద్ది రోజులు ముందుగా ఈ నిబంధనలను ప్రకటించడం చూస్తుంటే సిఎఎ అమలును విచ్ఛిన్నకర, మతపరమైన పోలరైజేషన (ద్రవీకరణ) ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించుకోవాలన్నదే బిజెపి ఎత్తుగడ అని స్పష్టమవుతోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ రీత్యా సిఎఎను, దాని అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటించింది.

➡️