సాధారణ ఎన్నికల నిర్వహణపైపటిష్ట కార్యాచరణ : సిఎస్‌

Jan 5,2024 10:51 #elections

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న సాధారణ ఎన్నికలను పటిష్టంగా, సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సన్నద్ధతపై గురువారం వెలగపూడి సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో సహా ఎన్నికల విధుల్లో నేరుగా సంబంధం ఉన్న వివిధ అధికారుల ఖాళీల భర్తీతోపాటు రాష్ట్ర, సిబ్బంది భర్తీపై రాష్ట్ర ఎన్నికల అధికారితో చర్చించారు. వెంటనే సంబంధిత ప్రతిపాదనలు పంపాలని, కొత్తవారికి పోస్టింగు ఇవ్వడంపైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సిబ్బందితో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యంగా ఎపి, ఒడిశా సరిహద్దులపై త్వరలో సమన్వయ సమావేశం నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ.. సన్నాహకాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రానికి రానుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌, సేల్స్‌ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌, అదనపు పిసిసిఎఫ్‌ గోపీనాథ్‌, ఎస్‌ఇబి డైరెక్టర్‌ ఎం రవి, రవాణాశాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి రాజశేఖర్‌, రజత్‌ భార్గవ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.

➡️