ఈవీఎం స్ట్రాంగ్‌ రూముల వద్ద పటిష్ట భద్రత

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

        కదిరి టౌన్‌ : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈవీఎం స్ట్రాంగ్‌ రూముల భద్రత పటిష్టంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు అధికారులకు సూచించారు. బుధవారం నాడు కదిరి అసెంబ్లీ నియోజకవర్గం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కదిరి పట్టణంలోని బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్‌ రూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులతో మాట్లాడారు. ఈవీఎం స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రత అత్యంత పటిష్టంగా పకడ్బందీగా ఉండాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఎక్కువ ద్వారాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో 1571 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1909 బ్యాలెట్‌ యూనిట్‌లు, కంట్రోల్‌ యూనిట్‌ 1909, వీవీ ప్యాట్‌లు ఆయా నియోజకవర్గాలకు అందజేయడం జరిగిందన్నారు. కదిరి నియోజకవర్గానికి సంబంధించి 281 పోలింగ్‌ కేంద్రాలలో 342 బ్యాలెట్‌ యూనిట్లు, 342 కంట్రోల్‌ యూనిట్లు, 396 వివి ప్యాట్‌లు పంపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వంశీకృష్ణ, డివిజన్‌ పరిధిలోని ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

➡️