సమస్య పరిష్కరించకుంటే 20 తర్వాత సమ్మె : సిసిఎల్‌ఎ ధర్నాలో విఆర్‌ఎ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అంజి

Jan 6,2024 10:57 #20, #CCLA dharna, #issue, #resolved, #strike, #VRA

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : విఆర్‌ఎల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 20వ తేదీ తర్వాత సమ్మె చేస్తామని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అంజి అన్నారు. మంగళగిరి సిసిఎల్‌ఎ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి శతవిధాల పోలీసులు ప్రయత్నించారు. చివరకు ధర్నా చేసి వినతిపత్రం అందజేయడానికి ఒప్పుకున్నారు. ఈ ధర్నాను ఉద్దేశించి అంజి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వారంలోపు విఆర్‌ఎల సమస్యలన్నిటిని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని, నేటికీ ఏ సమస్యలూ పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. 2023 సెప్టెంబర్‌లో ధర్నా చేసినప్పుడు డిఎ రూ.500 వేతనంతో కలిపి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. నామినీలకు ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. గతంలో 10వ తరగతి ఉండగా, ప్రస్తుతం ఇంటర్మీడియట్‌, డిగ్రీ క్వాలిఫికేషన్‌ పెట్టారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లాగా పేస్కేలు అమలు చేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదని తెలిపారు. విఆర్‌ఎలకు వాచ్‌మెన్‌, విఆర్‌ఒ, అటెండర్‌ పోస్టులు 70 శాతం పెంచి ఎన్నికలలోపు ఖాళీగా ఉన్న విఆర్‌ఒ, అటెండర్‌ పోస్టులను సీనియార్టీ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలన్నిటిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చేయకపోతే ఈ నెల 20వ తేదీ తర్వాత సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. అనంతరం భూ పరిపాలన అధికారి ఎఎండి ఇంతియాజ్‌కు సిసిఎల్‌ఎ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో ఇంతియాజ్‌ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం బాలాజీ, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు బంది, త్రినాథ్‌, రవి, రమేష్‌, నాగేంద్రం, ఆంజనేయులు, సుబ్బయ్య, ప్రసాద్‌, వెంకటరమణ, రహిమాన్‌, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️