మనస్తత్వాలకు అద్దంపట్టే కథలు

Apr 21,2024 11:35 #Sneha

కథ అంటే సహజత్వం, సరళత, సామాజిక స్పృహ, ఒక మంచి సందేశం ఉంటే అది పరిపూర్ణతను సంతరించుకుంటుంది. వృత్తి రీత్యా ఉపాధ్యాయిని, ప్రవృత్తి రీత్యా సృజనశీలి మన రచయిత డా. లక్ష్మీ రాఘవ. చిన్న చిన్న కథల్లో పెద్ద పెద్ద సందేశాలు ‘లౌక్యం’గా చెప్పటం ఆమెకే చెల్లింది. లౌక్యం కథా సంపుటిలో పాత్రలన్నింటినీ లౌక్యంతో అంటే ‘నొప్పింపక తానొవ్వక’ అన్నట్టు నడిపించారు రచయిత.

పేజీలు : 114
వెల : రూ. 100 /-
లౌక్యం (కథా సంపుటి)
లక్ష్మీ రాఘవ
3-99, అప్పగారి వీధి,
కురబాల కోట-517 350
అన్నమయ్య జిల్లా, ఎపి
94401 24700

‘మంచి’ అనే కథలో బాగా చదువుకునే ఒక టీనేజ్‌ కుర్రాడు బాధ్యతగా ఎలా మెలుగుతాడో చెప్పటం ఇప్పటి తరానికి సూచనగా ఉంది. అంతేకాదు. ఎవరికైనా సాయం అవసరమైనప్పుడు తోడ్పడటం మనకు వచ్చే అవకాశంగా తీసుకోవాలని చెప్పటంలో.. పిల్లలను పెంచే విధానం ఇలా ఉండాలి అని తల్లిదండ్రులకు చిన్న చురకలా ఉంది. స్వార్థం, అసూయతో ఉన్న సుభద్రను, చిన్నవాడైనా తన మంచితనంతో మార్చిన సురేష్‌ ఔదార్యం అర్థమయ్యేలా ఆకట్టుకునేలా ఉన్న చాలా సరళమైన కథ. ఆప్యాయతకు మించిన ఆనందం.. ఆనందానికి మించిన ఆరోగ్యం మరేమీ కాదని చక్కగా చెప్పారీ కథలో.
పిల్లలకు ఆర్థికం కంటే ఆప్యాయతలే సమానంగా పంచాలని తల్లిదండ్రులకు సూచనగా అనిపించినా.. కుటుంబంలోని అందరూ మంచి మనసులతో వ్యవహరించేలా తీర్చిదిద్దిన ప్రతి పాత్రా ఆదరించదగినదే ‘ఆర్థికమూ- ఆప్యాయతా’ అనే కథలో. పెద్దవారయిపోయాక వారికుండే చిన్నచిన్న కోరికలను ఇప్పటి వారి పిల్లలు చాలామంది చాదస్తంగా కొట్టి పారేస్తారు. అవి సహజంగా ఖర్చుతో కూడుకున్నవి కూడా కాదు. తరతరాలుగా వస్తున్న భూమి, వారి జీవనంలో భాగమైన ఇల్లు లాంటి స్థిరాస్తులే ఉంటాయి. వాటిని తీర్చగలిగితే మనకూ తృప్తిగా ఉంటుందని చెబుతారు ‘నేలతల్లి’ అనే కథలో.
‘ప్రాధాన్యం’ అనే కథలో పరువు అనే పేరుతో విర్రవీగుతున్న కుల, మతోన్మాదులకు.. సమాజానికి సమాధానంగా కుల దురహంకారాన్ని ఎదిరించిన సునీత పాత్ర ఆదర్శనీయం. అయితే రచయిత ముగింపులో సమాజానికి ఏది ప్రాధాన్యం? అని.. సమాధానం మీ ఇష్టం అన్నట్లు చదువరులకే వదిలేయటం కథకు అసంపూర్ణంగా అనిపించింది. ‘సమాజానికి కులం కంటే గుణం గొప్పది అని నిరూపిస్తాను’ అని సునీత పాత్రతో పలికించినప్పటికీ రచయిత మనోభావం కూడా అదే అని స్పష్టంగా చెబితే మంచి సందేశంగా అనిపించేది. బతక నేర్చిన తనమా.. లౌక్యమా అనేది పక్కన పెడితే ఈ రోజుల్లో అలా ఉండటం తప్పనిసరి అని మాత్రం ఈ ‘లౌక్యం’ కథ చదివిన ప్రతి ఒక్కరూ భావిస్తారు. శేఖర్‌ పాత్రలో లౌక్యాన్ని చాలా తెలివిగా తన పనులతో పాటు ఇతరుల పనులు కూడా అయ్యేలా చూడటం.. ప్రతిఫలం వేరొకరు అడ్డుచెప్పలేని రీతిలో అందుకోవటం ఆసక్తిగా ఉంది.
డబ్బుతో పాటు అహం పెరిగితే.. ఆ అహంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, ఆపదలో ఆదుకున్న వారిపట్ల చూపించే కుసంస్కారపు ఆలోచనలతో మంచి జీవితాన్ని నాశనం చేసుకున్న శేఖర్‌ పాత్ర నైతిక విలువలు కోల్పోయిన వారికి ఒక గుణపాఠం ‘ముగింపు’ అనే కథలో. ఆత్మాభిమానంతో మెలిగితే గౌరవప్రదమైన జీవితం సొంతమవుతుందని.. స్త్రీ అబల కాదు సబల అని పద్మ పాత్ర ద్వారా రచయిత చెప్పిన వైనం బాగుంది. మన పక్కనే జరుగుతున్న విషయంలా ఉంది. సంస్కారం అనేది మన ప్రవర్తనతోనే ప్రస్ఫుటమవుతుందని.. ఈ కథలో చాలా చక్కగా వ్యక్తీకరించారు రచయిత.
‘నిస్వార్థం’ అనే కథలో పల్లె జీవనానికి, పట్నం జీవితాలకు మధ్య ఉండే తేడాను చాలా సరళంగా, సున్నితంగా చెప్పారు రచయిత. పల్లెల్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం.. ప్రేమాభిమానాలు.. స్వాభిమానాలు.. పట్టుదలలు ఎలా ఉంటాయనే విషయం పట్నంలో నివశించే జగదీష్‌కు ఆశ్చర్యాన్ని కలిగించటం.. పేదవాడైనా రమణ చూపించే ఆత్మాభిమానం.. అతని కుటుంబం పట్ల జగదీష్‌ అత్తమామలు చూపించే ఔదార్యం.. జగదీష్‌ దంపతుల స్వార్థపూరిత ఆలోచనలతో రమణ కొడుకును ఉద్ధరిస్తామంటూ పట్నం తీసుకెళ్ళాలనుకోవటం.. ఆ బాలుడి నిస్వార్థపు అభీష్టం ముందు వీరి స్వార్థం ఓడిపోవటం ేవారికి చెంపపెట్టులా ఉంది.
‘మరణం తనకే కానీ పుస్తకానికి కాదు, అదెప్పుడూ చిరంజీవి’ అనుకుని మురిసిపోతామని రచయిత మనోగతాన్ని అంతే సరళంగా చెప్పిన ఆశాజీవి రచయిత డాక్టర్‌ లక్ష్మీ రాఘవ.

టి. టాన్య
7095858888

➡️