నిలిచిన అంగన్వాడీ సేవలు

Dec 12,2023 16:22 #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా విజయనగరం అర్బన్ ప్రాజెక్ట్ నందు 11 సెక్టార్లు 317 సెంటర్లు ను బందు చేసి కలెక్టరేట్ వద్ద కు వర్కర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సమ్మె సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడటంతో సేవలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు బి. పైడ్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీల అమల కోసం గత నాలుగేళ్లుగా శాంతియుతంగా మా నిరసన తెలియజేశామని, నిన్న కూడా ప్రభుత్వంతో చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధం కావాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తెలంగాణ కంటే అదనంగా జీతం, గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మార్చడం తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా,శిశు సంరక్షణ కోసం గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు సర్వీస్ అందిస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలు ఒంటరి వాళ్ళు కాదని, సిపిఎం పార్టీ మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రాజకీయంగా తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ. జగన్మోహన్రావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి మహాసంకల్ప యాత్రలో తెలంగాణ కంటే అదనంగా 1000/- రూ ” లు జీతం పెంచుతామని , జీవో నెంబర్ 7 ప్రకారం ఇల్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని, సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీల అమలు కోసం సమ్మె చేయాల్సిన రావడం దురదృష్టకరమన్నారు. గ్రాట్యూటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అంగన్వాడీలు న్యాయమైన సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. ఏపీ మెడికల్ సేల్స్ అండ్ రెప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యూఎస్ రవికుమార్ మాట్లాడుతూ 42 శాతం మంది పిల్లలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతుంటే, కేంద్రంలో బిజెపి , రాష్ట్రంలో వైసిపి ఐసిడిఎస్ ను బలహీనపరిచే విధానాలను అమలు చేయడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలు అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కావని, ఐసిడిఎస్ ను సంస్థాగతం చేసి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని చేస్తున్న పోరాటాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ నాయకులు విశాలాక్షి, శివలక్ష్మి, మంగ లక్ష్మి సెక్టార్ లీడర్లు లలిత, ప్రసన్న, జయ, ఈశ్వరమ్మ, పార్వతి, సరస్వతి, ఇందిరా విజయనగరం అర్బన్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️