ఇజ్రాయిల్‌కు ఆయుధ సరఫరాలను ఆపండి

  •  ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి పిలుపు

జెనీవా : గాజాలో నెలల తరబడి సాగుతున్న యుద్ధం, విధ్వంసం, ప్రాణనష్టంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు, ఖండనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌కు ఆయుధ సరఫరాలను తక్షణమే ఆపేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. గాజాలో సాగుతున్న యుద్ధ నేరాలకు ఇజ్రాయిల్‌ను బాధ్యురాలిని చేయాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. పాలస్తీనియన్లపై హక్కుల ఉల్లంఘనలను నివారించే లక్ష్యంతో ఈ తీర్మానం రూపొందించారు. 47 మంది సభ్యులు కలిగిన మానవ హక్కుల మండలిలో తీర్మానానికి అనుకూలంగా 28 ఓట్లు రాగా, ఆరు ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. 13మంది గైర్హాజరయ్యారు.
పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ ఉపయోగిస్తున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అలాగే అటు పౌర ప్రయోజనాలకు ఇటు సైనిక ప్రయోజనాలకు ఉపయోగించగల పరికరాల దిగుమతులపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఐక్యరాజ్య సమితి మద్దతు కలిగిన ఇన్వెస్టిగేటర్లను మండలి కోరింది. అయితే ఈ తీర్మానానికి కట్టుబడి వుండాల్సిన అవసరం లేదు. అమెరికా, జర్మనీ, ఇతర దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తుండగా, కొన్ని యురోపియన్‌ దేశాలు మాత్రం అనుకూలంగా ఓటు వేశాయి. చాలా దేశాలు గైర్హాజరయ్యాయి. అమెరికాతో కలిసి ఇజ్రాయిల్‌ ఈ తీర్మానాన్ని తీవ్రంగా విమర్శించింది. ఇజ్రాయిల్‌ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ తరచుగా మండలిని విమర్శిస్తోంది. మరే ఇతర దేశంపైనా చేయనన్ని తీర్మానాలను మానవ హక్కుల మండలి, ఇజ్రాయిల్‌పై చేసింది.

➡️