రాయి

Apr 22,2024 03:30 #sahityam, #stone

అవును
రాయేకదా అనుకోకండి
విసిరినవాడెవడో, ఎందుకు విసిరాడోగాని,
ఇప్పుడు రాయికూడా రాజకీయం చేస్తోంది.
రాయి చరిత్ర చిన్నదేమి కాదు

ఆదిమ మానవుడి తొలి ఆయుధం రాయేకదా!
బైబిల్‌లో కూడా రాయి గురించి ఎన్నిప్రవచనాలో,
నిరాకరించిన రాయి తలకు మూలరాయి అయింది.
తిరస్కరించిన రాయి మూలకు శిరస్సుగా మారింది.
మీలోపాపం చేయనివాడు మొట్టమొదట
ఆమె(వేశ్య) మీద రాయివేయవచ్చునని యేసుచెప్పెను.
ఒడిశెలతో దావీదు విసిరిన రాయి గొల్యాతును కూల్చింది.

ఇపుడు జయాపజయాలకు,
రాయి గీటురాయిగా మారింది.
నా చిన్నప్పుడు గొడ్లుకాడ పిల్లలం
రాళ్ళతో చింతకాయలు కొట్టేది.
చిదుగులు పొగేసి రాయితో నిప్పురాజేసేది.
ఇప్పుడైనా రాత్రిపూట
కుక్కలెంటబడితే, రాయేదిక్కు !
ఏ రాయయితేంటి పళ్ళూడగొట్టేందుకు !
అది గులకరాయా, గ్రానైట్‌రాయా,
ఏదైతేంటి ? రాయి ఒకగొప్ప ఆయుధం.
ఇప్పుడురాయే రాజకీయం చేస్తోంది.
ఒక రాజ్యాన్ని కూల్చొచ్చు,
మరొక రాజ్యాన్ని,
తిరిగి లేపనూ వచ్చు !

– కత్తి కళ్యాణ్‌
63038 47077

➡️