ఢిల్లీలో 16న రహస్య చర్చల తర్వాతే జిందాల్‌తో ఒప్పందం?

steel plant privatization jindal company

కార్మికులు, యూనియన్‌లతో చర్చించని స్టీల్‌ యాజమాన్యం

ఫిక్స్‌డ్‌ కాస్ట్‌ రూ.550 కోట్లతో సంబంధం లేదన్న జిందాల్‌

చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి : స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ మనుగడను దెబ్బతీసేలా యాజమాన్యం దూకుడుగా వెళ్తూ కేంద్రంలోని బిజెపి అడుగులకు మడుగులొత్తుతోంది. ఈ నెల 16న ఢిల్లీలో బిజెపి పెద్దల సమక్షంలో జరిగిన చీకటి చర్చలనంతరం ఈ నెల 19న జిందాల్‌తో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిపాలనా భవనంలో యాజమాన్యం ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై ప్లాంట్‌లోని అన్ని విభాగాల కార్మికులూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందం విశాఖకు మరింత కీడు చేస్తుందంటూ మండిపడుతున్నారు. కార్మిక సంఘాలతో కాదుకదా కనీసం గుర్తింపు యూనియన్లతో కూడా స్టీల్‌ యాజమాన్యం సంప్రదింపులు జరపలేదు. అగ్రిమెంట్‌లో ఏముంది?ఫిక్స్‌డ్‌ కాస్ట్‌గా పలు రకాల కేటగిరీల్లో యాజమాన్యం చేసే చెల్లింపులు సుమారు రూ.550 కోట్లను తాను చెల్లించేది లేదని జిందాల్‌ యాజమాన్యం తెగేసి చెప్పినట్లు సమాచారం. ఉద్యోగుల జీతాలు రూ.220 కోట్లు, రిపేర్స్‌ అండ్‌ మెయింటినెన్స్‌ రూ.50 కోట్లు, వడ్డీలు రూ.180 కోట్లు, డిప్రిషియేషన్‌ రూ.100 కోట్లు కలిపి రూ.550 కోట్లు ఫిక్స్‌డ్‌ కాస్ట్‌గా భావిస్తారు. దీంట్లో, ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదంటూ జిందాల్‌ అగ్రిమెంట్‌ చేసుకుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌, స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ బుధవారం రాత్రి మీడియాకు తెలిపారు. దీనిని యాజమాన్యం బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ రూ.550 కోట్లను బ్లాస్ట్‌ ఫర్నేస్‌ 1, 2 భరిస్తే, 3ను జిందాల్‌ నడపడం వల్ల ప్లాంట్‌కు ఒనగూరేదేముంటుందంటూ? కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

  • 90 వేల టన్నులు జిందాల్‌ సొంతం చేసుకోనుందా?

బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ద్వారా ఏటా రెండు లక్షల టన్నుల స్టీల్‌ ఉత్పత్తి అవుతుంటే, తాజా అగ్రిమెంట్‌లో 90 వేల టన్నులు జిందాల్‌ తీసుకెళ్లేందుకు చీకటి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 1.10 లక్షల టన్నులకు వారిచ్చే ముడిసరుకు రూ.350 కోట్లు మాత్రమే. దీనికోసం రూ.3 లక్షల కోట్ల విలువైన ప్లాంట్‌ను జిందాల్‌కు వదిలేస్తారా? అని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిందాల్‌ తీసుకెళ్లిన 90 వేల టన్నులకు కన్వర్షన్‌ఛార్జీ టన్నుకు కేవలం రూ.6400 చెల్లించడానికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కార్మికుల జీతాలు, డిప్రియేషన్‌, ఇంట రెస్ట్‌ వేటితోనూసంబంధం లేకుండా ఫర్నేస్‌ను వాడుకుని లాభాలు సంపాదించే స్కెచ్‌ జిందాల్‌ వేసింది.

  • సెయిల్‌తో చర్చలంటూనే టాటా ప్రతినిధుల పర్యటనలు

సెయిల్‌తో కలసి పనిచేసేందుకే అంగీకరించని కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో కలుపు తుందని ఎలా అనుకుంటామని కార్మికులు పేర్కొం టున్నారు. ఓ పక్క అడ్మ్రినిస్ట్రేషన్‌ భవన్‌లో టాటా ప్రతినిధులతో స్టీల్‌ యాజమాన్యం చర్చలు జరుపు తూనే, మరో భవనంలో జిందాల్‌తో అగ్రిమెంట్‌కు దిగడం కార్మికుల కళ్లు కప్పి ప్లాంట్‌ను నష్టపరచే వ్యూహమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️