పేపరు మిల్లు కార్మికులకు అండగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

  • సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వర రావు

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : ఎపి పేపర్‌ మిల్లు యాజమాన్యం నిరంకుశ విధానాలను వీడి కార్మికుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో రాజమండ్రిలో ఆందోళన చేపట్టనున్నామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. పేపర్‌ మిల్లు కార్మికులు చేపట్టిన సమ్మెను శుక్రవారం మూడోరోజుకు చేరుకుంది. దీనికి మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రెస్‌ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. నూతన వేతన ఒప్పందం కోసం కార్మికులు 72 గంటలుగా సమ్మె చేస్తున్నా యాజమాన్యం, అధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమని తెలిపారు. కార్మికులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని, బాధ్యతాయుతంగా స్పందించాల్సిన యాజమాన్యం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ వేతనం పెంచాల్సిన అవసరం లేదనడం సిగ్గు చేటని అన్నారు. ఎపి పేపర్‌ మిల్లు యాజమాన్యం చివరి వేతన ఒప్పందం 2017తో ముగిసిందని తెలిపారు. గడిచిన ఏడేళ్లలో నిత్యావసర నరుకుల ధరలు 300 నుంచి 400 శాతం పెరిగాయని తెలిపారు. ఏడాదికి రూ.200 కోట్లు నికర లాభాలు వస్తున్నట్లు గణాంకాలే చెబుతున్నాయని తెలిపారు. లాభాల్లో ఉన్నప్పటికీ కార్మికులకు యాజమాన్యం అన్యాయం చేస్తోందని వివరించారు.
. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్‌ మాట్లాడుతూ మిల్లులోని కార్మిక సంఘాలు వేతన ఒప్పందం కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించకపోవడం వల్లే కార్మికులు సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు టి మధు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై టిడిపి, వైసిపి అభ్యర్థులు తమ వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇఫ్టూ నగర కార్యదర్శి కె జోజి మాట్లాడుతూ పేపరు మిల్లు యాజమాన్యం దిగొచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఐఎన్‌టియుసి నాయకులు మాధవ్‌ మాట్లాడుతూ కార్మికులు చేపట్టిన సమ్మెకు తమ యూనియన్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

➡️