పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్‌ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమవుతుంది. 22 వరకు నామినేషన్ల దాఖలు, 24న పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఈ నెల 29వ తేదీన పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారన్నారు. అడ్వొకేట్‌ కమిషన్‌ సభ్యులైన న్యాయవాదులు జి.యం.మొహినుద్దీన్‌, ప్రశాంత్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయని.. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గనాలని ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 జిల్లా యూనిట్ల టీజీడీఏ ఎన్నికలు ప్రస్తుతం జరగనున్నాయి. ప్రతి యూనిట్‌ నుంచి 19 మందిని ఎన్నుకుంటారు. వీరిలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు కలసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని ఎన్నుకోనున్నారు. జూన్‌లో రాష్ట్ర సంఘం ఎన్నికలు జరుగుతాయి. వైద్య సంఘాల న్యాయ వివాదాల పరిష్కారం నేపథ్యంలో 2014 తర్వాత ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 4 వేల మంది వైద్యులు రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం సభ్యులుగా ఉన్నారు.

➡️