మంత్రులకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Nov 27,2023 21:17 #Nara Lokesh, #yuvagalam padayatra
  • కేసులకు భయపడేది లేదు
  • పొదలాడ నుంచి తిరిగి ప్రారంభమైన ‘యువగళం’లో నారా లోకేష్‌

ప్రజాశక్తి- అమలాపురం, రాజోలు: రాష్ట్రంలోని మంత్రులకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని, మరో మూడు నెలల్లో అరాచక పాలనకు పుల్‌స్టాప్‌ పడనుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో తాత్కాలికంగా నిలిచిన యువగళం పాదయాత్ర 79 రోజుల విరామం అనంతరం తిరిగి సోమవారం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి ప్రారంభమైంది. పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు, ముఖ్యనేతలు పొదలాడ చేరుకున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా తాటిపాక సెంటర్‌లో నిర్వహించిన సభలో లోకేష్‌ మాట్లాడారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి టిడిపి అధినేత చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారన్నారు. తనపైనా సిఐడి అధికారులతో కేసులు పెట్టించారని వివరించారు. కానీ, ఒక్క ఆధారమూ చూపలేకపోయారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని పునరుద్ఘాటించారు. జగన్‌ పాలనలో సామాజిక అన్యాయం జరిగిందని విమర్శించారు. దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పాదయాత్రలో అన్ని వర్గాల వారినీ కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నానని తెలిపారు. టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి కష్టాలు తీరుతాయన్నారు. పాదయాత్రను మొదటి రోజు నుంచే అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. అనంతరం యాత్ర నగరం మీదుగా మామిడికుదురు, పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో సాగింది. అమలాపురంలోని పేరూరులో లోకేష్‌ రాత్రి బసచేశారు. మారిన రూటు సెప్టెంబరు 8న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది. సెప్టెంబర్‌ 9న టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుతో లోకేశ్‌ యాత్రను నిలిపివేశారు. గతంలో నిర్దేశించిన మార్గంలో కాకుండా ఈసారి రూట్‌ మారింది. గత షెడ్యూల్‌ ప్రకారం కోనసీమ జిల్లా పర్యటన అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు రావాలి ఉంది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం కాకినాడ జిల్లాలోకి ప్రవేశించనుంది.

➡️