కోచ్చిలో తొక్కిసలాట

Nov 26,2023 09:29 #Kochi, #Stampede
  • నలుగురు విద్యార్థులు మృతి
  • మరో 65 మందికి గాయాలు

కోచ్చి : కేరళలోని కోచ్చి విశ్వవిద్యాలయంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్‌లో సాయంత్రం టెక్‌ఫెస్ట్‌ నిర్వహిస్తుండగా వర్షం కురియటంతో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు చనిపోయారు. మరో 65 మంది గాయ పడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. మృతులను అన్నా రుఫ్తా, సారా థామస్‌, అతుల్‌ తంబి, అల్బిన్‌ జోసఫ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను కలమస్సేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంలో జరిగిన టెక్‌ ఫెస్ట్‌ కార్యక్రమంలో రాత్రి 7 గంటలకు వర్షం కురవడంతో విద్యార్థులు లోపలి వైపు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ నిఖితా గాంధీ లైవ్‌ కాన్సర్ట్‌ను వీక్షించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన విషాదం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోందని విజయన్‌ అన్నారు. మరణించిన నలుగురు విద్యార్థుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా సూచనలు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్‌, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌.బిందు పరిస్థితిని నేరుగా అంచనా వేసేందుకు, కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు కోచ్చి వెళ్లారు. సంతాపాన్ని తెలియ జేసేందుకు మంత్రులు అత్యవసరంగా సమావేశమయ్యారు. విద్యార్థులు మరణించడంతో సంతాప సూచకంగా ఆదివారం జరగాల్సి ఉన్న నవకేరళ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. కోజికోడ్‌లో శనివారం రాత్రి ప్రభుత్వం అతిథి గృహంలో ఈ సమావేశం జరిగింది.

కలమస్సేరిలో ప్రత్యేక వైద్య శిబిరం

తొక్కిసలాట నేపథ్యంలో ఎర్నాకులం జిల్లా కలమస్సేరి మెడికల్‌ కాలేజీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. దీని కోసం వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఇప్పటికే అక్కడకి చేరుకున్నారని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులు కూడా సిద్ధంగా ఉండాలని, భారీ సంఖ్యలో 108 అంబులెన్స్‌లను సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు. త్రిసూర్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన సర్జరీ, ఆర్థోపెడిక్స్‌ విభాగం వైద్యుల బృందం ఎర్నాకులం చేరుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

➡️