ఘాటెక్కిన ఆవకాయ !

Apr 15,2024 08:32 #Spicy avocado
  • ఆకాశాన్నంటుతున్న మామిడి కాయలు, కారం, నూనె ధరలు
  • పచ్చడి మెతుకులకూ జనం దూరం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఆవకాయ తయారీలో వాడే మామిడికాయలు, కారం, నూనె, ఆవపిండి, వెల్లుల్లి వంటి వాటి ధరలు గతంలో ఎన్నడూ లేని రీతిలో అనూహ్యంగా పెరగడంతో సామాన్యులే కాదు… ధనికులు సైతం వామ్మో అంటున్నారు. వంద కాయల పచ్చడికి రూ.8,500 వరకూ వెచ్చించాల్సి వస్తోంది. తెలుగువారికి ఎంతో ప్రియమైన వాటిలో ఆవకాయ పచ్చడి ఒకటి. పేద, ధనిక తేడా లేకుండా వేసవి సీజన్‌ వచ్చిందంటే ఏడాదికి సరిపడా నిల్వ పచ్చడి తయారు చేసుకోవడం ఆనవాయితీ. కూరగాయల ధరలు అందుబాటులో లేనప్పుడు, ఉపాధి లేని రోజుల్లో పల్లెల్లో, పట్టణాల్లో శ్రమ జీవులు ఆవకాయ పచ్చడితో కడుపునింపుకుంటారు. ఏడాది పాటు నిల్వ ఉండడంతో ఈ పచ్చడి తయారీపై అత్యధిక మంది మక్కువ చూపిస్తుంటారు. అటువంటి ఆవకాయ ఈ సీజన్లో మండిపోతోంది. పెరిగిన ధరల నేపథ్యంలో సామాన్యులు ఈ ఏడాది ఆవకాయ పచ్చడి తయారీకి దూరంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చిన్న, పెద్ద రసాలు రకం మామిడి కాయలను ఆవకాయ తయారీకి వాడుతుంటారు. ఎక్కువ కాలం ముక్క మెత్తబడకుండా ఉండేందుకు కాయ కొనుగోలులో రాజీపడరు. గతంలో ఈ రకం కాయ సైజును బట్టి రూ.10 నుంచి రూ.15 ఉండేది. ప్రస్తుతం రూ.20 నుంచి రూ.30 వరకూ ధర పలుకుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం వంద కాయలు కొనాలంటే రూ.3 వేల వరకూ ఖర్చవుతోంది. బ్రాండెడ్‌ కారం కేజీ ప్రస్తుత ధర రూ.750పైనే ఉంది. వంద కాయలు పచ్చడి పెట్టాలంటే మూడు నుంచి నాలుగు కేజీల కారం అవసరం. అంటే, కారానికి మరో రూ.3 వేల వరకూ ఖర్చవుతుంది. వెల్లుల్లి కిలో రూ.300, ఆవాలు కిలో రూ.100, మెంతులు కిలో రూ.100, ఉప్పు కిలో రూ.20లకు చేరాయి. ఐదు కిలోల వేరు శనగ (గానుగ) నూనె కిలో రూ.210 ఉంది. మొత్తం రూ.1,050 ఖర్చు అవుతోంది. గతేడాదితో పోల్చితే రూ.1,500 వరకూ ఖర్చు పెరిగింది. వేరుశనగ నూనె గతేడాది కిలో రూ.160, వెల్లుల్లి కేజీ రూ.70 నుంచి రూ.100, కారం కేజీ రూ.350లోపు ఉంది. మెంతులు, ఆవాలు రేట్లు కూడా రూ.200 నుంచి 250 ఉన్నాయి.

ఈ ఏడాది పచ్చడికి దూరం
కూరలేకపోయినా పర్వాలేదు. అవకాయ పచ్చడి ఉంటే చాలు. అన్నంతో కడుపు నింపేసుకునేవాళ్లం. ఏటా ఏప్రిల్‌, మే నెల వచ్చిందంటే పచ్చడి తయారు చేసి సంవత్సరానికి సరిపడా నిల్వ ఉంచుకుంటాము. ప్రస్తుతం 50 కాయల పచ్చడికి రూ.4 వేలు ఖర్చవుతుంది. మరో రెండు వారాలు దాటితో పచ్చడి కాయలు దొరికే పరిస్థితి లేదు.
                           – ఒనుగులమ్మ, కార్మికురాలు, లాలాచెరువు, రాజమహేంద్రవరం

ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగాయి
గత 30 సంవత్సరాలుగా ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్నాను. హైదరాబాద్‌లో స్థిరపడిన కూతురు, కోడలికి పంపిస్తుంటాను. కొంత పచ్చడి మేము ఉంచుకుంటాం. ఈ ఏడాది ధరలు విపరీతంగా పెరిగాయి. నిల్వ పచ్చడి కావాలంటే సరుకులు నాణ్యంగా ఉండాలి. వంద కాయల పచ్చడికి రూ.8,500 వరకూ అవుతుంది. అంత వెచ్చించలేక 25 కాయలకే పరిమితమయ్యాను.
                                                                                    – బి.రమాదేవి, గృహిణి, ఆర్యాపురం

➡️