పిల్లలతో గడపండి ..!

Apr 24,2024 10:28 #Jeevana Stories

పరీక్షలు అయిపోయాయి. సెలవులు వచ్చేశాయి. పిల్లలకు ఒకటే హుషారు. పెద్దలకు ఏమో బేజారు. ఈ ఎండల్లో పిల్లలను ఎలా కాపాడుకోవాలి? బయటికి పంపించకుండా ఎలా నియంత్రించాలి? వడదెబ్బ కొట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా తల్లిదండ్రులు ఒక్కో రకంగా ఆలోచిస్తుంటారు. అయితే వీటన్నింటి మధ్య ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఒకప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడిపేవారు. పిల్లలు కూడా ప్రతిదీ అమ్మానాన్నతో చర్చించేవారు. స్కూలు నుండి ఇంటికి వచ్చాక స్కూలు విషయాలు అమ్మతో పదే పదే చెప్పి విసిగించిన విషయం ఈకాలం పెద్దలకి చాలామందికి గుర్తు వుండే వుంటుంది. ఆకాశంలో చుక్కలు లెక్కబెడుతూ అమ్మ చేతి గోరుముద్దలు తిన్న జ్ఞాపకాలు ఉండనే ఉంటాయి. సెలవులకు అమ్మమ్మలు, నానమ్మల ఊళ్లు వెళ్లి కొత్త స్నేహాలు పెంచుకున్న అనుభవాలు చాలామందివే. మరి ఈ కాలం పిల్లలకి, అవన్నీ లభిస్తున్నాయా? అసలు వాళ్లు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా?
ఇప్పుడంతా ‘స్మార్ట్‌’ పిల్లల కాలం. వాళ్లకి అరచేతిలో ప్రపంచం కళ్లముందు కనపడుతోంది. గేమ్స్‌, యాప్‌ల పేరుతో పిల్లలని ఆకర్షించే ఆన్‌లైన్‌ సెషన్లు కోకొల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలని వాళ్ల మానాన వాళ్లని వదిలేయకూడదు. మనతో పాటు నడవనివ్వాలి. మాట్లాడనివ్వాలి. నవ్వనివ్వాలి. ఆటలాడుకునే వీలు కల్పించాలి. భావాలను వ్యక్తపరిచే వాతావరణం కల్పించాలి.

ఈ సెలవుల్లో దొరికిన తీరిక సమయం, మళ్లీ ఏడాది గడిస్తే కాని రాదు. పిల్లల్లో గుర్తించిన ఏవేని లోపాలను సరిదిద్దే కాలం ఇదే. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మొండిగా, పెంకిగా తయారైన పిల్లలను మంచి మాటలతో దారిలోకి తెచ్చుకోవాలి. నయానో భయానో చెప్పడం కాదు.. బెదిరించి, కొట్టి మాట వినేలా చేసుకోవడం కాదు. వాళ్లకి అర్థమయ్యే భాషలో చెప్పాలి.
ముఖ్యంగా ఈ సెలవుల్లో పిల్లలతో గడిపే సమయాన్ని పెంచుకోవాలి. వంటగదిలో వాళ్ల భాగస్వామ్యం పెంచాలి. కూరగాయలు అందించడం, డైనింగ్‌ టేబుల్‌పై గిన్నెలు సర్దడం వంటి చిన్న చిన్న పనులు అప్పగించాలి. అప్పుడే అమ్మ బాధ్యతలు అర్థమవుతాయి. ఉదయం, సాయంత్రాలు మొక్కలకు నీళ్లు పోయమని చెప్పాలి. ప్రకృతి పాఠాలు నేర్చుకుంటారు. చిన్న చిన్న వ్యాయామాలు నేర్పించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. భోజనం సరిగ్గా చేయని పిల్లలకు వేళకి ఎందుకు భోజనం చేయాలో చెప్పాలి. ప్రతి రోజూ కాలకృత్యాలు తీర్చుకోవడం, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన పెంచడానికి ఇది సరైన కాలం.
కొంతమంది పిల్లలకు పెద్దలతో ఎలా వ్యవహరించాలో తెలియదు. అడిగినదానికి సమాధానం చెప్పకపోవడం, ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగితే ముడుచుకుపోవడం, గట్టిగా మాట్లాడితే ఏడుపు ముఖం పెట్టడం వంటి లక్షణాలు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తాయి. ఇవేమీ పెద్ద విషయాలు కావు. బాల్యం నుండి వాళ్లుపెరిగిన వాతావరణం అలా ప్రవర్తించేలా చేస్తుంది. కాబట్టి ఈ సెలవుల్లో పిల్లలతో కాసేపు సమయం గడిపితే వారిని ఆ భావనల నుండి దూరం చేయవచ్చు.
పిల్లల కోపాన్ని తగ్గించాలన్నా, మొండితనం, పెంకితనం మాన్పించాలన్నా పిల్లలతో ప్రత్యేక సమయం గడిపితే చాలు. వాళ్ల చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించితే ఈ రకమైన ధోరణుల నుండి పిల్లలను దూరం చేయవచ్చు. పిల్లల్లో కలిగే ప్రతి శారీరక, మానసిక సమస్యలకు పెద్దల ప్రవర్తనే కీలకం. కాబట్టి ఆ సమస్యల నుండి పిల్లలను దూరం చేసే బాధ్యత కూడా పెద్దలదే. దీనికోసం పెద్ద పెద్ద ప్రయోగాలు ఏమీ చేయక్కర్లేదు. పిల్లలతో విలువైన సమయం గడిపితే చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సెలవుల్లో ఎంచక్కా మీ పిల్లలతో ఎంజారు చేసేయండి. పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఎదిగే వీలు కల్పించండి.

➡️