విద్యుత్‌ పునరుద్ధరణకు ప్రత్యేక టీములు

Dec 6,2023 10:44 #Electricity, #Tufan
  •  ఎపిఎస్‌పిడిసిఎల్‌ పరిధిలో రూ.13 కోట్లు నష్టం

ప్రజాశక్తి -తిరుపతి సిటీ, అమరావతి: బ్యూరోనెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాలను పూడ్చేందుకు ప్రత్యేక టీమ్‌లను నియమించామని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ తెలిపారు. ఎపి ట్రాన్స్‌కో, డిస్కామ్స్‌, ఎపిజెన్‌కో, ఎపిఇపిడిసిఎల్‌ సిఎమ్‌డిలతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. కృష్ణపట్నం యూనిట్లు 2, 3 విద్యుత్‌ సమస్యతోపాటు బొగ్గు ఫీడింగ్‌ సమస్యతో ట్రిప్‌ అయ్యాయన్నారు. 132కెవి లైన్లు ఎస్‌ఎస్‌కి కనెక్ట్‌ చేశామన్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని ఆరు పట్టణాలకు, 1119 గ్రామాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఎపిఎస్‌పిడిసిఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.సంతోషరావు తెలిపారు. సంస్థకు సుమారు రూ.13 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. మంగళవారం సాయంత్రానికి 1.81 లక్షల విద్యుత్‌ సర్వీసులు, 5425 వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు సరఫరాను పునరుద్ధరించామన్నారు. మిగిలిన సర్వీసులకు బుధవారం సాయంత్రానికి పునరుద్ధరిస్తామన్నారు.

➡️