అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కరించాలి 

Feb 19,2024 13:21 #Annamayya district
spandana in annamayya

స్పందనలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్

ప్రజాశక్తి-రాయచోటి : “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో అందిన ప్రజల సమస్యలు రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాలు నందు… ప్రజా ఫిర్యాదుల స్వీకరణ జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు, మదనపల్లి ఆర్డీవో హరిప్రసాద్, ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… నాణ్యతగా అర్జీలను పరిష్కరించడం అత్యంత కీలకమన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఆర్జీలను అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం మరియు అధికారులపై ప్రజలలో నమ్మకం పెరగాలంటే జగనన్నకు చెపుదాం అర్జీలను ఎలాంటి ఆలస్యం లేకుండా సకాలంలో వేగవంతంగా పరిష్కరించాలన్నారు. డివిజన్ స్థాయిలో, మండలాలలో కూడా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పటిష్టంగా ప్రాధాన్యతతో నిర్వహించాలని డివిజన్ మరియు మండల అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపకుండా పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ప్రజల నుండి వారు అర్జీలను స్వీకరించారు.

స్పందన ద్వారా.. ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని…

రాయచోటి మండలం ఎగువ అబ్బవరం గ్రామానికి చెందిన వెంకటరమణ తన ఇంటికి వెళ్ళు దారి ఆక్రమణకు గురైందని దానిని తొలగించాలని జిల్లా కలెక్టరుకు అర్జీ సమర్పించారు.

వీరబల్లి మండలం తాటికుంటపల్లికి చెందిన చిన్నపరెడ్డి తన తండ్రి పేరు మీద ఉన్న స్థలాన్ని తన అనుమతి లేకుండా వేరేవాళ్లు ఆన్లైన్ చేయించుకున్నారని, దానిని తిరిగి తన తండ్రి పేరు మీద ఆన్లైన్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరుకు అర్జీ సమర్పించారు.

గాలివీడు మండలం నూలివీడు గ్రామానికి చెందిన మురళీకృష్ణ తనకు సంబంధించిన భూమి ఆన్లైన్లో మిగులు భూమిగా చూపిస్తోందని, దానిని తన సొంత భూమిగా మార్చాలని విన్నవిస్తూ జిల్లా కలెక్టరుకు అర్జీ సమర్పించారు.

ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️