‘సుప్రీం’ నుంచి సొరెన్‌ పిటిషన్‌ వెనక్కి

న్యూఢిల్లీ : హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరెన్‌.. తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై మార్చి 2 నాటికి ముగిసిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరవటం కోసం హేమంత్‌ సొరెన్‌ జార్ఖండ్‌ హైకోర్టును గతంలో అనుమతి కోరారు. న్యాయస్థానం ఆ సమయంలో ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును హేమంత్‌ సొరెన్‌ ఆశ్రయించాడు. సోమవారం ఆయన పిటిషన్‌ విచారణ.. న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, కె.వి విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. హేమంత్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ హాజరయ్యారు. బడ్జెట్‌ సమావేశాలు మార్చి 2న ముగిసినందున పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది. మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ మాజీ సీఎంను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఈయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

➡️