నడవలేని బిడ్డ కోసం… బడికెళ్లిన తల్లి ప్రేమ

Dec 29,2023 07:39 #Education, #Jeevana Stories, #teacher
sony working as teacher for disable children jeevana story

 

  • ఇది ఓ అమ్మ కథ.. ఆరోగ్యం బాగోని బిడ్డ ఆశను నెరవేర్చేందుకు బడి బాట పట్టిన ఓ తల్లి ప్రయాణం. హర్యానా సోనీపట్‌లో నివసించే సోనీ, చక్రాల కుర్చీకే పరిమితమైన తన బిడ్డ షబ్నమ్‌తో పాటు స్కూలుకు వెళుతోంది. పాఠాలు చదువుతోంది. కుటుంబం గడవాలంటే భార్యభర్త ఇద్దరూ కష్టపడాల్సిన ఆర్థిక పరిస్థితి వారిది. అయినా సరే, బిడ్డ ఆకాంక్షే వారికి ప్రధానం అయింది. చదువుకోవాలనుందని చెప్పలేకపోయిన బిడ్డ ఆశలను ఆ తల్లి హృదయం అర్థం చేసుకుంది. అందుకే షబ్నమ్‌తో పాటు బడిబాట పట్టింది. మాటలు రాని, నడవలేని బిడ్డను చదివించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి చదువు విలువ తెలుసు. ఎన్ని కష్టాలు పడినా బిడ్డలను చదివించుకోవాలనుకున్నారు. అయితే ఆ బిడ్డల్లో ఒక బిడ్డ పుట్టుకతోనే అనారోగ్యం పాలైంది. పచ్చకామెర్లతో పుట్టిన ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, రూ.లక్ష కావాలన్నారు. అంత డబ్బు వాళ్ల దగ్గర లేదు. రోజురోజుకు బిడ్డ ఆరోగ్యం క్షీణించింది. అందరిలా మాట్లాడలేదు. నడవలేదు. చక్రాల కుర్చీకే పరిమితమైంది. తన పరిస్థితి చూసి, సోనీ, ఆమె భర్త ముంతాజ్‌ ఎంతో తల్లడిల్లిపోయారు. ”రోగిష్టి బిడ్డను ఎదురుగా పెట్టుకుని ఎందుకు ఏడుస్తారు? కాళ్లు, చేతులు బాగా ఉన్న ఈ ఇద్దరు పిల్లలను శ్రద్ధగా పెంచండి. చదివించుకోండి. ఈ పిల్ల చదివితే ఏంటి? చదవకపోతే ఏంటి?’ అన్న కఠోర మాటలు మాకు ఎదురయ్యాయి. అప్పుడు కత్తులతో పొడిచినంత బాధను అనుభవించాం. తనతో పాటు పుట్టిన అక్క, తమ్ముడు యూనిఫామ్‌ వేసుకుని స్కూలుకు వెళుతుంటే వాళ్ల వంకే షబ్నమ్‌ తదేకంగా చూసేది. అప్పుడు తన కళ్లల్లో మెరుపు చూశాను. చదువుకోవాలనుకున్నా వీలులేని నా చిట్టితల్లి వేదన తలచుకొని, నా హృదయం ముక్కలయ్యేది. ఒకసారి స్కూలుకు వెళ్లాలనుందని సైగలతో చెప్పింది. అప్పుడు నాకు సంతోషంతో పాటు దు:ఖం ఆగలేదు. అలా చెప్పిన నాలుగేళ్లకు కానీ తను స్కూల్లో అడుగు పెట్టలేదు” అని సోనీ చెబుతున్నప్పుడు బిడ్డ పట్ల తల్లి పడే ఆరాటం కనపడింది. షబ్నమ్‌ను స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకునేందుకు స్కూలు యాజమాన్యం అంగీకరించింది. అయితే, వారు పాపతో పాటు తల్లిని కూడా ఉండమన్నారు. ”ఆ పిల్లను చూసుకునేందుకు మాకు ప్రత్యేక సదుపాయాలు లేవు. కాబట్టి, నువ్వు కూడా ఇక్కడ ఉండడం మంచిది.” అని టీచర్లు సూచించారు. నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. నా బిడ్డ చదువుకోవడం నాకు కావాలి. అందుకే రోజంతా అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను. ఈ సమయంలో కుటుంబానికి ఆసరాగా నా భర్తకు తోడుగా నేను కూడా సంపాదించాలి. కానీ, నా షబ్నమ్‌ కోరిక నెరవేర్చడమే నాకు ముఖ్యం” అంటున్నప్పుడు సోనీ కళ్లల్లో ఓ కర్తవ్యం కనిపించింది.

  • చిల్లర వేసేవారు

‘స్కూలుకు వెళ్లే దారి చాలా ట్రాఫిక్‌ ఉంటుంది. దీంతో షబ్నమ్‌ని ఒళ్లో కూర్చోపెట్టుకుని చక్రాల కుర్చీ నడుపుకుంటూ స్కూలుకు వెళ్లేదాన్ని. దారి మధ్యలో కొంతమంది మమ్మల్ని యాచకులు అని భావించి చిల్లర డబ్బులు ఇచ్చేవారు. అప్పుడు నేను దు:ఖాన్ని దిగమింగుకుంటూ ‘మేము స్కూలుకు వెళుతున్నాం. అడుక్కోవడానికి కాద’ని చెప్పేదాన్ని’ అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆ తల్లి చెప్పింది.

 

  • మళ్లీ చదువుకోవాలని…

సోనీ తన చిన్నప్పుడు మూడో తరగతి వరకూ చదివింది. బిడ్డతో పాటు రోజంతా స్కూల్లో గడుపుతున్నప్పుడు మళ్లీ చదువుకోవాలన్న కోరిక కలిగింది. అదే విషయాన్ని టీచర్‌ ఆర్తీసింగ్‌తో చెప్పింది. సోనీ లాంటి మహిళల్లో అక్షరాస్యత నింపేందుకు ఎంతో కాలంగా శ్రమిస్తోన్న ఆర్తీ, ఆమె అభ్యర్థనను సాదరంగా స్వాగతించారు. షబ్నమ్‌ చదువుతున్న రెండో క్లాసులోనే సోనీకి అడ్మిషను ఇప్పించారు.

”బిడ్డ పక్కనే కూర్చొని, పెన్సిల్‌ పట్టుకోవడం, గీతలు గీయడం నేర్పిస్తూ, తనతో పాటు చదువుతూ ఉన్న ముగ్గురు బిడ్డల తల్లి సోనీని చూస్తే నా మనసు ఎంతో పులకించిపోయేది. బిడ్డను అమ్మ కంటే ఇంత బాగా ఎవరు అర్థం చేసుకోగలరు? సోనీ ప్రయత్నం చూస్తుంటే షబ్నమ్‌ ఎప్పటికైనా మాట్లాడగలదని, నడవగలదని ఆశ పుడుతోంది. వారిద్దరినీ చూసిన వారందరూ ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటారు.” అని ఆర్తీ చెబుతున్నారు.

  • షబ్నమ్‌ భవిష్యత్తులో నడవొచ్చు, నడవలేక పోవొచ్చు. మాట్లాడొచ్చు, మాట్లాడలేక పోవచ్చు. అయినా ఆ తల్లి తన ప్రయాత్నాలు ఆపదు. సోనీ కథ చదువుతుంటే, తమకు వీలున్నా, వీలుపడకపోయినా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కోసం పరితపించే ఎందరో అమ్మలు స్ఫురణకు వస్తారు.

 

ఆర్తి … ఓ మంచి ఉపాధ్యాయిని!ఆ స్కూలు ఉపాధ్యాయురాలు ఆర్తీసింగ్‌ది కూడా చెప్పుకోవాల్సిన కథ. ఆమెకు సామాజిక స్పృహ ఎక్కువ. అందరికీ చదవడం, రాయడం రావాలనేది ఆమె ఆశ.”నా ప్రాంతంలో ఉన్న మహిళలకు చదువు నేర్పాలనేది నా ఆసక్తి. నాలాగే భావించే విద్యావంతులతో కలసి, ఒక బృందాన్ని తయారు చేశాను. మేమంతా ఇళ్లిళ్లు తిరుగుతూ అందరినీ అడిగేవాళ్లం. అప్పుడు ‘మేము అక్షరాలు దిద్దుతూ కూర్చుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు? అంట్లు ఎవరు తోముతారు? బట్టలు ఎవరు ఉతుకుతారు?’ అని మహిళలు ఎదురు ప్రశ్నించేవారు. ఒక్కోసారి ”అంట్లు మేము తోముతాం, అక్షరాలు దిద్దండి” అని చెప్పేవాళ్లం. అయినా ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు సోనీ వచ్చింది. అయితే సోనీ కథ వేరు” అని ఆర్తీ టీచర్‌ తన గ్రామంలో తలపెట్టిన అక్షర సేద్యం గురించి వివరించారు. షబ్నం, సోనీ చదువు ఆశ ముందుకు సాగటానికి ఆమె ఒక బలమైన ఆసరా.

➡️