విద్యుద్ఘాతంతో తండ్రీకుమారుడు మృతి

two deaths by electricity shock

పొలంలో మోటారు మరమ్మతులు చేస్తుండగా ఘటన

ప్రజాశక్తిానార్పల (అనంతపురం జిల్లా) అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని జగంరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఉదయం తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పొలంలో మోటారు మరమ్మతు నిమిత్తం వెళ్లిన తండ్రీకుమారుడు విద్యుదాఘాతంతో మరణించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. నార్పల మండలం జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భయపరెడ్డి (43) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమారుడు రాజారెడ్డి (17) హైదరాబాద్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇటీవల ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం తండ్రీకొడుకు కలిసి నరసాపురం గ్రామ సమీపంలోని వారి సొంత పొలంలో వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి వెళ్లారు. వ్యవసాయ పంపుసెట్‌ మోటార్‌కు నీటి తడి తగిలి పాచి పట్టడంతో దానిని శుభ్రం చేసేందుకు భయపరెడ్డి ప్రయత్నించారు. ఆ మోటార్‌కు కరెంటు వైర్లు తగలడంతో అది పట్టుకోగానే విద్యాదాఘాతానికి గురై కిందపడ్డారు. దీనిని చూసిన రాజారెడ్డి తండ్రిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయనను పట్టుకున్నాడు. దీంతో షాక్‌కు గురై అక్కడికక్కడే ఇద్దరూ మరణించారు. తోటి రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భయపరెడ్డి పెద్ద కుమారుడు సంతోష్‌కుమార్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కుళ్లాయప్ప డిమాండ్‌ చేశారు.

➡️