సోషలిజం అజరామరం – లెనిన్‌ శతవర్థంతి సభలో వక్తలు

– పలు పుస్తకాల ఆవిష్కరణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సోషలిజం అజరామరమని, పేదలు, కూలీలు, శ్రామికులు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని, ఎర్రజెండా ఉన్నంతకాలం శ్రామికవర్గ పోరాటాలు ఉంటాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. రష్యా విప్లవ యోధుడు విఐ లెనిన్‌ శత వర్థంతి సభ ఆదివారం విజయవాడలోని లెనిన్‌ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ క్రేన్‌ సాయంతో లెనిన్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లెనిన్‌ జీవితం, ఆచరణ, రష్యా విప్లవ చరిత్రకు సంబంధించి ప్రజాశక్తి, విశాలాంధ్ర బుకహేౌస్‌లు ప్రచురించిన పుస్తకాలను వారు ఆవిష్కరించారు. అలాగే రెండు సంస్థలూ ఉమ్మడిగా ప్రచురించిన లెనిన్‌ ప్రత్యేక కేలండరునూ విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోషలిజం అజరామరమని కార్మికవర్గ పోరాటాలు ఉన్నంతకాలం అది ఉంటుందని, రాబోయే కాలంలో ప్రపంచంలో కమ్యూనిజం వస్తుందని, క్యాపిటలిజాన్ని పూడ్చిపెడుతుందని, అది చరిత్ర చెబుతున్న వాస్తవమని అన్నారు. పెట్టుబడిదారీ విధానాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించగలమనే ధైర్యాన్ని ప్రపంచానికి అందించిన లెనిన్‌, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. భౌతికంగా చనిపోయినా కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఒకప్పుడు సోవియట్లో ప్రజల రాజ్యం నడిచిందని, కమ్యూనిస్టులకే అది సాధ్యమైందని పేర్కొన్నారు. కానీ నేటి ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావని, ప్రజలను దోచుకోవడం తప్ప సంక్షేమం వారికి పట్టడం లేదని అన్నారు. దేశంలో మోడీ కూడా ప్రజల బాధలు వదిలేసి మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంస్కృతిక నిరంకుశత్వాన్ని ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు. మోడీ విధానాలను లెనిన్‌ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ఇచ్చిన లౌకిక రాజ్యాన్ని మోడీ తుంగలో తొక్కారని పేర్కొన్నారు. మత ప్రాతిపదికన దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. మోడీ గొప్పవారని ఆయన సొంత మీడియా ప్రచారం చేసుకుంటోందని, వాస్తవంగా మోడీ విఫల ప్రధాని అని విమర్శించారు. దాన్నుండి బయటపడటం కోసం మతాన్ని ముందుకు తెచ్చి విశ్వాసాలతో ఆడుకుంటున్నారని వివరించారు. దేశంలో 28 కోట్ల మంది ప్రజలు పేదరికరలో ఉంటే వారి గురించి మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. శ్రమజీవులు, కష్టజీవులు, పేద ప్రజానీకం ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని వివరించారు. లెనిన్‌ వర్థంతిని ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో జరుపుతున్నారంటే అది సోషలిజం, కమ్యూనిజాన్ని అనుసరించిన లెనిన్‌ సిద్ధాంత గొప్పతనమని పేర్కొన్నారు. సిపిఐ సీనియర్‌ నాయకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వర్గపోరాటాల ద్వారానే ప్రజా పోరాటాలు బలోపేతం అవుతాయని లెనిన్‌ నిరూపించారని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి మాట్లాడుతూ.. ప్రపంచంలో మహిళా సమానత్వాన్ని కోరుకున్న వ్యక్తి లెనిన్‌ అని అన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ.. లెనిన్‌ పాలన ప్రపంచానికి ఆదర్శమని, పెట్టుబడిదారీ దేశాలు ఎన్నికుట్రలు చేస్తున్నా వాటిని ఇప్పటికీ అడ్డుకోగలుగుతుంది కమ్యూనిస్టులేనని పేర్కొన్నారు. దివికుమార్‌ మాట్లాడుతూ.. సిద్ధాంతం లేని పోరాటం సరికాదని, బలమైన ఆచరణతో కూడిన సిద్ధాంతమే సమాజ మార్పునకు మూలమని లెనిన్‌ నిరూపించారని వివరించారు. ఈ కార్యక్రమంలో బుడ్డిగ జమిందార్‌, ప్రజాశక్తి, విశాలాంధ్ర బుకహేౌస్‌ జనరల్‌ మేనేజర్లు కె లక్ష్మయ్య, మనోహర్‌నాయుడు, సిపిఎం నాయకులు సిహెచ్‌ బాబూరావు, కాశీనాథ్‌, సిపిఐ నాయకులు జి కోటేశ్వరరావు, దుర్గాభవానీ, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ఎడిటర్‌ గడ్డం కోటేశ్వరరావు, సాహితీ స్రవంతి నాయకులు శాంతిశ్రీ, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ ఛైర్మన్‌ గోళ్ల నారాయణరావు తదితరులు పాల్గన్నారు. లెనిన్‌ శత వర్థంతి నేపథ్యంలో ఐదు రోజులపాటు లెనిన్‌ విగ్రహం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

➡️