శివసేన ఎమ్మెల్యే అనీల్‌ బాబర్‌ కన్నుమూత

సంగ్లీ (మహారాష్ట్ర) : శివసేన ఎమ్మెల్యే అనీల్‌ బాబర్‌ (74) బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అనీల్‌ బాబర్‌ దురదృష్టవశాత్తు కన్నుమూశారు. ఆయన మృతితో శివసేన సామాజిక సేవా విభాగాన్ని నడుపుతున్న అత్యంత ప్రభావవంతమైన ప్రజాప్రతినిధిని మనం కోల్పోయాం. ఖానాపూర్‌ నియోజకవర్గంలో శివసేన కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, టెంట్‌ పథకం అమలుకు కృషి చేయడం, విద్యా సంస్థల ద్వారా అట్టడుగు స్థాయివారికి విద్యనందించారు. అనీల్‌ బాబర్‌ ఆదర్శప్రాయమైన ప్రజాప్రతినిధిగా పనిచేశారు.’ అని షిండే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. బాబర్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని షిండే తెలిపారు. మరోవైపు బాబర్‌ అకాల మరణం నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది.

కాగా, ఉద్ధవ్‌ఠాక్రే, ఏక్‌నాథ్‌షిండేల మధ్య విభేదాలు వచ్చి శివసేన పార్టీ రెండుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో అనీల్‌ బాబర్‌ షిండే వర్గంవేపే వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఖానాపూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.

➡️