దూసుకెళ్తున్న పిఎస్‌యుల షేర్లు

Dec 16,2023 21:15 #Business

దిగ్గజ కార్పొరేట్ల కంటే మెరుగు

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డ్‌ గరిష్టాలను చేరగా.. ఆ క్రమంలోనే పిఎస్‌యుల స్టాక్స్‌కు డిమాండ్‌ నెలకొంది. డిసెంబర్‌ 15 నాటికి సెన్సెక్స్‌ 71,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. మార్కెట్ల ర్యాలీలో టాటా, అంబానీ, ఆదానీ కంపెనీల కంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధాన పాత్ర పోశించడం విశేషం. ముఖ్యంగా సెన్సెక్స్‌ 60వేల పాయింట్ల నుంచి 70వేల పాయింట్లకు మధ్యన ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్‌ విలువ రెట్టింపు అయ్యింది. ఈ మధ్యకాలంలో పిఎస్‌యుల మార్కెట్‌ విలువ రెట్టింపై డిసెంబర్‌ 14 నాటికి రూ.46.4 లక్షల కోట్లకు చేరింది. వీటి విలువ 129 శాతం ఎగిసింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్‌ కంపెనీల విలువ 46.9 శాతం పెరిగి రూ.14.37 లక్షల కోట్లను చేరింది ముకేష్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌ సంపద 10.3 శాతం పెరిగి రూ.18.61 లక్షల కోట్లుగా నమోదయ్యింది. టాటా గ్రూప్‌ సంస్థలు విలువ 33.7 శాతం వృద్థితో రూ.27.40 లక్షల కోట్లకు ఎగబాకింది. వీటిలో అన్నింటికంటే అధికంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మార్కెట్‌ విలువ విలువ రూ.5.78 లక్షల కోట్లకు చేరుకుంది. తర్వాత స్థానంలో రూ.5.5 లక్షల కోట్లతో ఎల్‌ఐసి నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌ సంస్థలున్నాయి. గడిచిన ఒక్క నెలలోనే ఎల్‌ఐసి షేర్‌ 30 శాతం పెరిగి రూ.800 చేరువలో నమోదయ్యింది. ఈ ఏడాదిలో ఇదే గరిష్ట స్థాయి కావడం విశేషం. శుక్రవారం సెషన్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 969.55 పాయింట్లు లేదా 1.37 శాతం పెరిగి 71,484కు చేరింది. ఐటి, పిఎస్‌యు స్టాక్స్‌ ప్రధాన మద్దతును అందించాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 274 పాయింట్లు లాభపడి 21,457 గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.

➡️