మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు – బిజెపి నేత యడియూరప్పపై పోక్సో కేసు

బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్‌ నేత బిఎస్‌ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. 17 ఏండ్ల మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్‌ పోలీసులు పోక్సో చట్టం కింద యడియూరప్ప పై కేసు నమోదు చేశారు.

ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్‌ కేసుకు సంబంధించి సహాయం కోరుతూ … తన 17 ఏండ్ల కుమార్తెతో కలిసి యడియూరప్ప దగ్గరకు వెళ్లామని, ఆ సమయంలో తన కుమార్తెను బిజెపి నేత యడియూరప్ప బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వాళ్లు పోలీసులను ఆశ్రయించగా.. అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయమై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించలేదు. 2008-2011 మధ్య కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప పనిచేశారు. 2018లో కొద్ది రోజులపాటు, ఆ తర్వాత జూలై 2019-2021 మధ్య మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2021, జులైలో బిజెపి అధిష్టానం యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం ఆయన కుమారుడు విజయేంద్ర యడియూరప్ప రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

➡️