యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు దత్తు కన్నుమూత

Dec 3,2023 09:59 #passed away, #Senior leader, #utf
dattu passed away
  • నేడు ఆల్వాల్‌లో అంత్యక్రియలు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు ఎంఎకె దత్తు (77) హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య లలిత, ఇద్దరు కుమారులు ప్రపూర్ణ, ప్రపుల్ల ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు దోమల్‌గూడలోని టిఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆల్వాల్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా, కోశాధికారిగా, అకడమిక్‌ సెల్‌ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. గుంటూరు జిల్లా ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మొదటితరం నాయకులైన ఎ.వెంకటస్వామి, దాచూరి రామిరెడ్డి, మైనేనితోపాటు నాగటి నారాయణ, కొండవీటి జోజయ్యతో కలిసి పనిచేశారు. గుంటూరు జిల్లా అమరావతిలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం తెలంగాణ యుటిఎఫ్‌ కార్యాలయంలో పూర్తికాలం సేవలందించారు. ఈ ఏడాది జనవరి 13,14 తేదీల్లో రంగారెడ్డి జిల్లా సాగర్‌ రోడ్‌ మన్నెగూడలో ఉన్న బిఎంఆర్‌ సార్థా కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలంగాణ యుటిఎఫ్‌ రాష్ట్ర ఐదో మహాసభల్లోనూ పాల్గొన్నారు. విఎస్‌ఆర్‌ సంతాపం దత్తు మరణం పట్ల సిపిఎం ఏపి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉపాధ్యాయ ఉద్యమంలో దత్తు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దత్తు మృతి ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటు అని తెలంగాణ యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ టీచర్‌ ప్రధాన సంపాదకులు పి మాణిక్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. సిపిఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వీరయ్య, చుక్కా రాములు ప్రభృతులు కూడా దత్తు మృతికి సంతాపం తెలిపారు.

➡️