టిక్కెట్లను అమ్ముకుంటున్నారు !

-ఎన్‌డిఎ భాగస్వామి చిరాగ్‌ పార్టీపై తీవ్ర విమర్శలు
– పలువురు సీనియర్‌ నేతలు రాజీనామా
పాట్నా : బీహార్‌లో బిజెపి నేతృత్వ ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉంటున్న చిరాగ్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (రాం విలాస్‌)కి బుధవారం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చిరాగ్‌ పాశ్వాన్‌, ఆయన అనుయాయులు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ టిక్కెట్లను కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారని సీనియర్‌ నేతలు పలువురు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తామంతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ రాష్ట్ర మంత్రి, జాతీయ ఉపాధ్యక్షుడు రేణు కుష్వాహా, మాజీ ఎంఎల్‌ఎ, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు సంజరు సింగ్‌, ఆర్గనైజేషన్‌ కార్యదర్శి రవీంద్ర సింగ్‌, వారి వారి మద్దతుదారులు రాష్ట్ర అధ్యక్షులు రాజు తివారీకి తమ రాజీనామా లేఖలను అందచేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, కోట్లాది రూపాయిలను తీసుకున్న తర్వాత శాంభవి చౌదరి (సమస్తిపూర్‌), రాజేష్‌ వర్మ(ఖగారియా), వీణాదేవి(వైశాలి) లకు పార్టీ టిక్కెట్లు కేటాయించారు. చిరాగ్‌ పాశ్వాన్‌, ఆయన సన్నిహితులు కలిసి ఈ సీట్లను అమ్ముకున్నారని వారు మీడియాతో ఆరోపించారు. అభ్యర్ధులను ఎంపిక చేసే సమయంలో సీనియర్‌ నేతలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. పార్టీ నిర్మాణం కోసం కష్టపడిన నేతలను పక్కకు నెట్టేశారని విమర్శించారు. చిరాగ్‌ పార్టీకి ఐదు సీట్లను కేటాయించారు. చిరాగ్‌హజీపూర్‌ నుండి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి, సీనియర్‌ జెడి(యు) నేత అశోక్‌చౌదరి కుమార్తె అయిన శాంభవి చౌదరి వైపు మెజారిటీ దళిత ఓట్లు వున్నాయి.

➡️