ఓటర్లను చైతన్య పర్చేందుకు సెల్ఫీ పాయింట్‌

Apr 3,2024 23:21

సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభిస్తున్న జెసి
ప్రజాశక్తి – మాచర్ల :
ఓటర్లను చైతన్యపర్చే కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. స్వీప్‌ ఆధ్వర్యంలో స్ధానిక ఆర్‌ఒ కార్యాలయంలో సెల్ఫీ పాయింట్‌ను జెసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం నమోదు చేసుకోవాలని, ఓటర్లయితే దాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఓటరు సెల్ఫీ దిగి రానున్న జనరల్‌ ఎలక్షన్స్‌లో నేను ఓటు వేయబోతున్నాను అని ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఇదిలా ఉండగా ఓటర్లను చైతన్యం చేసేందుకు రూపొందించిన ప్రత్యేక రథంతో పలువార్డుల్లో ప్రచారం చేపట్టారు. కార్యక్ర మంలో తహశీల్ధార్‌ మంజునాధ్‌రెడ్డి, ఎలక్షన్‌ డిటి జానిబాషా, ఆర్‌ఐ శ్రీనివా సరావు, విఆర్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్బందుల్లేకుండా పింఛన్ల పంపిణీ
లబ్ధిదార్లకు ఇబ్బంది రాకుండా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ప్రసాద్‌ చెప్పారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం స్థానిక తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 48,943 మంది లబ్ధిదార్లున్నారని, వీరికి పంపిణీ చేసే పింఛను నగదును మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపిడిఒలు విత్‌ డ్రా చేశారని చెప్పారు. ఈ మొత్తాన్ని సచివాలయాల కార్యదర్శుల వద్దకు చేర్చి పింఛనుదారులకు అందిస్తామన్నారు. సచివాలయంతో పాటు సచివాలయం పరిధిలోని హెబిటేషన్స్‌ వద్దకు కూడ సిబ్బంది వచ్చి పెన్షన్లు సులువుగా పంపిణి చేస్తారని అన్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పింఛను పంపిణీ ఉంటుందన్నారు. మంచానికే పరిమితమైన వారికి సిబ్బంది ఇంటికి వెళ్లి ఇస్తారన్నారు. 81 సచివాలయాల పరిధిలో 630 మంది సిబ్బంది పంపిణి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు 6వ తేదిలోపు పంపిణీని పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ డి.వెంకటదాసు, తహశీల్ధార్‌ మంజునాధ్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️