ఆత్మ విశ్వాసం

Apr 7,2024 07:50 #Sneha, #Stories

‘శ్రీకాంత్‌ని ఎందుకు అన్ని మాటలు అన్నారు. అసలే వాడికి కాలు అనువు! దానికి తోడు మీ నీతి బోధనలు. నిన్న వాడిని బలవంత పెట్టి మరీ షటిల్‌ ఆడించేరు. దానివల్ల వాడు పడిపోయి దెబ్బలు తగిలించుకున్నాడు. నిన్నట్నుంచీ వాడు గది నుంచి బయటకు రాలేదట. ఇవన్నీ నిన్న మీ వదిన సావిత్రి నాకు ఫోన్‌ చేసి చెప్పింది. అందుకే పిల్లలెవ్వరికి నీతులు చెప్పొద్దని మీకు చెబుతుంటాను అయినా బధిర శంఖారావం. మీరెప్పుడూ నా మాట వినరు. ఇప్పుడు చూడండి మీ అన్న కుటుంబం అంతా మన మీద గుర్రుగా ఉన్నారు’ అంది కళ్యాణి.
కళ్యాణి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. నేనేదో మంచి కోసం నాలుగు మంచి మాటలు చెబితే అది తప్పా? దానికి వాడు బాధపడుతున్నాడా? పోనీ వాడంటే పదిహేడేళ్ళ కుర్రవాడు. మరి మా అన్న వదినలకేమైంది? వాళ్ళైనా అర్థం చేసుకోవాలి కదా. నేను చిన్నాన్నగా చెప్పింది వాడి బాగు కోసమే కదా? మరి అందుకు విరుద్ధంగా ఎలా జరిగింది అన్న భావన కలిగి మనసు పరి పరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో నాకు నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు రాసాగింది.
నాలుగు రోజుల క్రితం నేను మా అన్నయ్య ఇంటికి నా భార్య కళ్యాణితో సహా మా అన్నయ్య రెండవ కొడుకు వంశీ పుట్టిన రోజు వేడుకకు వెళ్ళాము. మేము ఇద్దరం అన్నదమ్ములం. మా చెల్లెలు రాధ హైదరాబాద్‌లో ఉంటుంది. మా అన్నయ్య, నేను ఇద్దరం విశాఖలోనే ఉద్యోగాలు చేస్తున్నాము. నేను జూనియర్‌ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ని. మా అన్నయ్య కలెక్టర్‌ ఆఫీసులో పని చేస్తున్నాడు. మాకు ఒక్క ఆడపిల్ల. శిరీష ఇంజనీరింగ్‌ చదువుతుంది. మా అన్నకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శ్రీకాంత్‌ రెండోవాడు వంశీ.
శ్రీకాంత్‌ పదవ తరగతి చదువుతున్నప్పుడు స్కూలుకు వెళుతున్న సమయంలో ఒక ఆటో గుద్దేయడంతో వాడి కాలు విరిగిపోయింది. అప్పుడు వాడు రెండు నెలలు హాస్పిటల్లో చికిత్స పొందాడు. రెండు ఎముకలు విరిగిపోవడంతో పాటు జాయింట్‌ దెబ్బతినడంతో పెద్ద ఆపరేషను చెయ్యవలసి వచ్చింది. ఎలాగైతేనేం గండం గడిచి బయట పడ్డాడు. కాకపోతే ఆపరేషన్‌ తరువాత నడకలో మార్పు వచ్చింది. ఒక కాలు పొట్టిదవడంతో కుంటుతూ నడుస్తుంటాడు. దానికి తోడు కాలు సహకరించక పోవడం వల్ల మెల్లగా నడుస్తుంటాడు.
అప్పట్నుంచీ వాణ్ణి అందరూ జాగ్రత్తగా చూసేవారు. రోజూ వాడిని స్కూల్‌కి ఆటోలో పంపేవారు. ఇంట్లో ఎవ్వరూ వాడి మీద కోపపడేవారు కాదు. పని కూడా చెప్పేవారు కాదు. దాంతో శ్రీకాంత్‌లో చలాకీతనం తగ్గింది. చదువు పట్ల శ్రద్ధ తగ్గించేసాడు. వాడు చిన్నప్పట్నుంచీ ఇంజనీర్‌ అవుతాననీ, ఐఐటీ చదువుతాననీ చెప్పేవాడు. కానీ కాలికి ప్రమాదం జరగడం వల్ల మా అన్న శంకరం వాడిని ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో చేర్పించలేదు. ఇంజనీరింగ్‌ చదివితే భవిష్యత్తుతో కాలు అనువు వల్ల ఉద్యోగం చెయ్యడం ఇబ్బందనీ వాడిని హెచ్‌.ఈ.సీ గ్రూపులో చేర్పించాడు.
ఎప్పుడైతే వాడు అనుకున్నది జరగక పోవడం వల్ల వాడిలో నిరాశ ఆవహించింది. చదువులో వెనకబడిపోయాడు. ముందర బెంచీ విద్యార్థి కాస్తా వెనక బెంచీ స్టూడెంట్‌గా మిగిలిపోయాడు. ఆ రోజు నేను భోజనాలప్పుడు అన్నయ్య కొడుకుల్ని వాళ్ళ చదువుల గురించి అడిగాను. శ్రీకాంత్‌ బాధపడుతూ ‘నాన్నగారు నన్ను హెచ్‌.ఈ.సీలో చేర్పించారు. ఇంజనీరింగ్‌ చదవడం, ఆ ఉద్యోగాలు చెయ్యడం ఈ కాలుతో కష్టం అనీ చెప్పాడు. నేను ఇంజనీరింగ్‌ చదువుతానంటే ఒప్పుకోలేదు’ అంటూ బిక్క ముఖం పెట్టాడు. అయితే వాడి మాటలు నాకు బాధ కలిగించాయి. అన్నయ్య మీద కోపం తెప్పించాయి.
‘చదివేది నువ్వా? మీ నాన్నా ? నీకు రెండు కాళ్ళు ఉన్నాయి. కాకపోతే నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నావు అంతే కదా! రెండు కాళ్ళూ లేనివాళ్లు అంధులు, పోలియోతో బాధపడే వాళ్ళు హాయిగా, దర్జాగా ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. అలాంటిది నీకేం కష్టం. బాలలత అన్న ఒక మహిళ ఐయ్యేఎస్‌కి ఎంపికైంది. ఇప్పుడు ఐయ్యేఎస్‌ రాసే వాళ్ళకు కోచింగ్‌ ఇస్తున్నారు. ఆవిడకి పోలియో. ఆమె వీల్‌ ఛైయిర్‌లో ఉంటారు. అయినా సరే మొక్కవోని సంకల్పంతో ఆవిడ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కేవలం మీ నాన్న చెప్పాడని, నువ్వు మానేస్తే నీదే తప్పు. చదువుకోగలనా లేదా అన్నది నువ్వు ఆలోచించుకోవాలి. ఇంజనీరింగ్‌ చదవడానికి నువ్వు అన్ని విధాలా అర్హుడవు. ఒకవేళ ఇంజనీరింగ్‌ చదివిన తరువాత ప్రమాదం జరిగితే ఏం చేద్దువు చెప్పు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. నన్నడిగితే మళ్ళీ సంవత్సరం నువ్వు ఎంపీసీ గ్రూపులో చేరి ఇంజనీరింగ్‌ కోసం ప్రయత్నించు. ఒక సంవత్సరం చదువు నష్టం అయినంత మాత్రాన నష్టమేమీ జరగదు. అని వాడికి హితబోధ చేశాను.
అప్పుడు మా అన్న శంకరం మౌనం దాల్చేడు. కానీ భోజనాల తరువాత పిల్లలు లేనప్పుడు నా మీద కోప్పడ్డాడు. శ్రీకాంత్‌ దగ్గర అలా అంటే వాడు మరింత బాధపడతాడని చెప్పాడు. మా వదిన సావిత్రి కూడా అన్నయ్యకు వంత పాడటంతో వాళ్ళకేమి చెప్పాలో నాకర్థం కాలేదు.
ఆ సాయంత్రం నేను శ్రీకాంత్‌, వంశీలతో కలసి దగ్గర్లోని స్కూలు గ్రౌండ్‌కి వెళ్ళాను. ప్రతీ రోజూ ఉదయం పూట నడక, సాయంత్రం పూట షటిల్‌ ఆడటం నాకలవాటు. ఆ గ్రౌండ్లో శ్రీకాంత్‌ స్నేహితులు షటిల్‌ ఆడుతుంటే నేను కూడా వాళ్ళతో ఆడటం మొదలుపెట్టాను. వంశీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆటకి వెళ్ళిపోయాడు. మేము షటిల్‌ ఆడుతుంటే శ్రీకాంత్‌ దూరంగా కూర్చొని మా ఆటని గమనించసాగేడు.
అప్పుడు నేను వాడితో ‘షటిల్‌ ఆడతావా?’ అనీ అడిగాను. శ్రీకాంత్‌ పదవ తరగతి వరకూ షటిల్‌ బాగా ఆడేవాడు. తొమ్మిదవ తరగతిలో జిల్లా షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఫస్టొచ్చాడు. కానీ కాలుకి ప్రమాదం జరిగినప్పట్నుంచీ ఆ ఆట మానేసాడు. నేను బలవంత పెట్టేసరికి వాడు లేచి నిలబడ్డాడు. అప్పుడు నేను ‘శ్రీకాంత్‌! భయపడకు. నువ్వు బ్రహ్మాండంగా ఆడగలవు. కమాన్‌’ అంటూ వాడికి రాకెట్‌ ఇచ్చాను. వాడికి లోపల ఆడాలనే ఉన్నా వాళ్ళ నాన్న ఏం అంటాడోనన్న బెంగ ఉంది. ఎప్పుడైతే నేను ఆడమని ప్రోత్సహించానో ఒక్కసారిగా లేచి బ్యాట్‌ అందుకున్నాడు.
అంతే! ఆ ఆవేశంలో కోర్టులోకి ప్రవేశించాడు. వెంటనే వాడూ నేనూ గేమ్‌ మొదలు పెట్టాము. ఆ గేమ్‌ హోరా హోరీగా జరిగింది. తాను ఓడిపోకూడదన్న కసిగా ఆడటంతో గేమ్‌ వాడే గెలిచాడు. కాకపోతే ఆ చివర షాట్‌ని డిసైడ్‌ చెయ్యడానికి ఎగిరి మరీ షాట్‌ కొట్టడంతో కాలు బెణికి కింద పడ్డాడు. దాంతో ఆపరేషన్‌ అయిన ఎడమ కాలు కాకుండా కుడికాలు కొద్దిగా బెణికింది. ఆట తరువాత వాడిని నేను, వాడి స్నేహితులు అభినందించాము.
కానీ వాడు కింద పడిపోవడాన్ని చూసిన వంశీ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నకు శ్రీకాంత్‌ షటిల్‌ ఆడి పడిపోయినట్లు చెప్పడంతో మా అన్నయ్య, వదిన నా మీద కోప్పడ్డారు. వాడి కాలుకి మళ్ళీ ఏమతుందోననీ ఆ రాత్రి అంతా వాళ్ళు గాభరా పడ్డారు. నాకు మా అన్న, వదినల సూటి పోటి మాటలకు బాధ కలిగి తెల్లవారిన తరువాత మా ఇంటికి వచ్చేశాను. ఇదీ మొన్న జరిగిన సంగతి.
ఎప్పుడైతే కళ్యాణి మూడు రోజుల తరువాత కూడా మా అన్న వాళ్ళు ఇంకా కోపంగా ఉన్నారని చెప్పగానే నాకు మరింత బాధ కలిగింది. అంటే వాళ్ళ కోపం ఇంకా తగ్గలేదని అనిపించింది. కనీసం శ్రీకాంతైనా ఫోన్‌ చేస్తాడని అనుకున్నాను. కానీ వాడు కూడా చెయ్యకపోవటంతో నా మీద వాడు కోపంతో ఉన్నాడని అనిపించింది. ఆ మర్నాడు సాయంత్రం నేను కాలేజీ నుంచి ఇంటికి వస్తూ మా అన్న ఇంటికి వెళ్ళాను. అప్పటికి వాడు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసాడు. నన్ను చూడగానే శ్రీకాంత్‌ పరుగున నా దగ్గరికి వచ్చాడు. వాడు అలా పరిగెడుతూ రావడం నాకు భయం కలిగించింది. పొరపాటున జారిపడితే కాలికి మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉందనీ నా భయం. నేను లోపలికి వెళ్ళి మా అన్నయ్యతో ‘అన్నా! మొన్న నేను చేసిన పనికి క్షమించు. నేను ఆటలో పడిపోయి శ్రీకాంత్‌ గురించి మరచిపోయి వాడిని ఆడమన్నాను. నా వల్లే వాడు పడిపోయాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా?’ అని చెప్పాను. ఇంతలో మా వదిన వచ్చి నన్ను పలకరించింది.
‘వదినా మొన్న నువ్వు కళ్యాణితో చెప్పి బాధ పడ్డావట. నిజంగా నేను చేసింది తప్పైతే క్షమించు. నేను కావాలని అలా చెయ్యలేదు. నా ఉద్దేశ్యంలో వాడికే అనువూ లేదు. వాడిని మీరే అనవసరంగా భయపెట్టేస్తున్నారు. దాంతో వాడి మీద వాడికి నమ్మకం ఉండటం లేదు, వాడికి కాన్ఫిడెన్స్‌ ఇవ్వటం పోయి, మీరు వాడిని మరింత నిరుత్సాహపరుస్తున్నారు. నిజంగా మీరు వాడికి ఏదో జరిగిందనీ అనవసరంగా గారాబం చేసి వాడిని పాడుచేస్తున్నారు. అది వాడికి మంచి చెయ్యదు సరికదా చెడు చేస్తోంది. మొన్న వాడు ఆట నాకన్నా బ్రహ్మాండంగా ఆడాడు. అన్నయ్య ఎలాగూ నా మాట వినడు. కనీసం నువ్వైనా వాడికి చెప్పు. నేను వాడి మంచి కోసమే అలా చేశాను తప్పా. వాడి మీద నాకే విధమైన కోపం లేదు’ అనీ చెప్పాను చెమర్చిన కళ్ళతో.
ఆ సమయంలో అక్కడికి శ్రీకాంత్‌ కళ్ళు తుడుచుకుంటూ వచ్చాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కంట్లో నీరు, వాడి ముఖంలో దుఃఖం కనిపిస్తోంది.’ చిన్నాన్నా! నేను అన్ని పనులూ చేసుకోగలను. అందరిలా పరిగెత్తగలను. ఆటలు ఆడగలను. మెట్లు ఎక్కగలను. కానీ మా అమ్మ నాన్నలే నాలో భయాన్ని కలిగిస్తున్నారు. మొన్న నువ్వు చెప్పిన తరువాత నాకు ఎంతో ధైర్యం వచ్చింది. నా మీద నాకే ఆత్మవిశ్వాసం పెరిగి అంత బాగా ఆడగలిగేను. నువ్కొక్కడివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నేను మళ్ళీ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో చేరి ఇంజనీరింగ్‌ చదువుతాను’ అని చెమర్చిన కళ్ళను తుడుచుకొంటూ చెప్పాడు. వాడి మాటలు విన్న తరువాత నాకు వాడి భవిష్యత్తు మీద నమ్మకం కలిగింది. ఆ ఆనందంతో ఇంటికి వచ్చాను.

  • గన్నవరపు నరసింహ మూర్తి
    93267 35406
➡️