రూ.34 కోట్లు విలువ చేసే నగదు, ఆభరణాలు సీజ్‌ – సిఇఒ ఎంకె మీనా

Apr 3,2024 23:38 #CEO MK Meena, #speech

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.34 కోట్ల విలువ చేసే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్‌ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా వెల్లడించారు. బుధవారం ఆయనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత తనిఖీల్లో రూ.11 కోట్ల నగదు, రూ.7 కోట్ల విలువైన మద్యం, రూ.10 కోట్లు విలువజేసే బంగారు, వెండి ఆభరణాలను సీజ్‌ చేశామన్నారు. నగదు, మద్యం, వాహనాల స్వాధీనానికి సంబంధించి 3,300 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని మీనా తెలిపారు. సి విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 5,500 ఫిర్యాదులు అందాయని, అందులో ఎన్నికలకు సంబంధించి 3,040 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. నియమావళిని ఉల్లంఘిస్తూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై 1,600, ఎన్నికల కోడ్‌ ఉన్నా ప్రచారం చేస్తున్న ఘటనలపై 107, అనుమతి లేకుండా ప్రచారంలో వాహనాల వాడకంపై 43, మతపరమైన ప్రచారాలపై 28, నగదు పంపిణీపై 29, మద్యం పంపిణీపై 17 ఫిర్యాదులు వచ్చాయని ఎంకె మీనా తెలిపారు.

➡️