సీమ గొంతెండుతోంది

  •  తీవ్రంగా తాగునీటి సమస్య శ్రీ ట్యాంకర్లతో నీటిని కొంటున్న జనం
  •  సిఎం, ప్రతిపక్షనేత సొంత నియోజకవర్గాల్లోనూ తప్పని తిప్పలు

రాయలసీమ గొంతెండుతోంది. సీమలోని అన్ని జిల్లాల్లోనూ తాగునీటి కొరత నెలకొంది. మండుతున్న ఎండలకు తోడు గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుండటంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. సీమలోని 250 మండలాలకుగాను సగానికిపైగా మండలాల్లో ఇప్పటికే నీటి కొరత ఎర్పడింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాయైన కడపతోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో కూడా తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటం, సమస్యలను పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగం కావడంతో అత్యంత కీలకమైన ఈ సమస్యను పట్టించుకునే వారే లేకుండాపోయారు.

ప్రజాశక్తి- యంత్రాంగం : సిఎం, ప్రతిపక్షనేత సొంత నియోజకవర్గాలైన పులివెందుల, కుప్పంలో కూడా తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. ఈ నెల మొదట్లోనే ఈ రెండు మున్సిపాల్టీల్లోనూ రోజువిడిచి రోజు నీటి సరఫరా అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. కడప నగరపాలక సంస్థతోపాటు పలమనేరు, పెనుకొండ, హిందూపూర్‌, గుత్తి మున్సిపాల్టీల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. గుత్తిలో కొళాయిల ద్వారా నెలకోసారి తాగునీటిని సరఫరాచేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా మూడు నాలుగు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏమాత్రం చాలడం లేదు. దీంతో ప్రజలు ట్యాంకర్‌కు 600 రూపాయలు చెల్లించి నీటిని కొనుగోలు చేస్తున్నారు. కడప నగర పాలక సంస్థతోపాటు మరికొన్ని మున్సిపాల్టీల్లోనూ ఇదే దుస్థితి ఏర్పడింది.

జిల్లాల వారీగా ఇలా…!

  •  సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాయైన వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 36 మండలాలు ఉండగా, 29 మండలాలను తాగునీటి సమస్య వేధిస్తోంది. వీటిలో 12 మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. కడప నగరంతోపాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటిని కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. పులివెందుల మున్సిపాల్టీలోనూ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. 264 హేబిటేషన్లలో ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు రూ.6.39 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, రోజులు గడుస్తున్నా ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు.
  •  కర్నూలు జిల్లాలో 26 మండలాలు ఉండగా వాటిలో 12 మండలాల్లో తాగునీటి కొరత నెలకొంది. 11 మండలాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని 4,253 బోర్లలో 212 పూర్తిగా పనిచేయడం లేదు. మిగిలిన వాటిలోనూ అరకొరగా నీరు వస్తోంది. 796 పిడబ్ల్యు పథకాల్లో 692 మాత్రమే పని చేస్తున్నాయి.. ఆస్పరి మండలంలో సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి ట్యాంకుల వద్ద బళ్లపై బిందెలతో పడిగాపులు కాయాల్సి వస్తోంది.
  •  నంద్యాల జిల్లాలో 29 మండలాలు ఉండగా, పది మండలాల్లో తాగునీటి కొరత ఉంది. జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీల్లో రెండు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 926 బోర్లు ఉండగా, వాటిలో 145 మరమ్మతులకు గురయ్యాయి. తొమ్మిది మండలాల్లో ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. అయితే, అవి ఏ మూలకూ చాలడం లేదు.
  •  శ్రీసత్యసాయి జిల్లాలోని 32 మండలాలకు గానూ 14 మండలాల్లో నీటి కొరత నెలకొంది. జిల్లాలో 14 బహుళార్థక రక్షిత మంచినీటి పథకలు, 4,880 రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. రక్షిత మంచినీటి పథకాల్లో అత్యధికంగా బోరుబావులే. భూగర్బ జలాలు పడిపోవడంతో వీటిలో అధికభాగం నిరుపయోగంగా మారాయి. గోరంట్ల, అగళి, మడకశిర, గుడిబండ, రొళ్ల, తనకల్లు మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. సుమారు 180 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా, ప్రజల అవసరాలకు చాలడం లేదు.
  •  అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాల్టీలో కొళాయిల ద్వారా నీటిసరఫరా దాదాపుగా నిలిచిపోయింది. ఇక్కడ నెలకు ఒక్క రోజు మాత్రమే కొళాయిల ద్వారా నీటిని వదులుతున్నారు. మూడు, నాలుగురోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తునప్పటికీ అవి ప్రజల అవసరాలకు ఏ మాత్రం చాలడం లేదు. దీంతో అత్యధిక కుటుంబాలు 600 రూపాయలకు ట్యాంకరు నీటిని కొనుగోలు చేస్తున్నాయి. రాయదుర్గం మున్సిపాలిటీలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో నీరు అడుగంటడంతో ఐదు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జిల్లాలోని 31 మండలాలకు గానూ 11 మండలాల్లో తాగునీటికి కొరత ఏర్పడింది. పలు గ్రామీణ ప్రాంతాల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది.
  • అన్నమయ్య జిల్లాలో మొత్తం 10,627 (స్కీం, చేతి పంపు బోర్లు కలిపి) బోర్లు ఉన్నాయి. వాటిలో 112 బోర్లు మరమ్మతుకు గురికావడంతో వాటిని బాగు చేశారు. తొమ్మిది మండలాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు.

మున్సిపాల్టీల్లో ఇలా…
ముఖ్యమంత్రి సొంత జిల్లా యైన కడప కార్పొరేషన్‌లోని కొన్ని ప్రాంతాలకు మూడు రోజులకు ఒకసారి, మరికొన్ని ప్రాంతాలకు ఐదు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో, కడప నగర ప్రజలు రూ.600కు ట్యాంకర్‌ నీటిని కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. బద్వేల్‌, మైదుకూరు మున్సిపాలిటీల్లో కూడా రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్లో రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో, ప్రజలు క్యాన్‌ నీటిని రూ.25కు కొంటున్నారు.
పెద్ద సంఖ్యలో తిరుపతికి వచ్చే యాత్రికులకు ఉచిత నీటి వసతి కరువైంది. శ్రీకాళహస్తి, వెంకటగిరి గూడూరు, సూళ్లూరుపేట, పుత్తూరు మున్సిపాల్టీల్లోనూ నీటి కొరత ఏర్పడింది. కర్పూలు జిల్లా ఆదోని మున్సిపాల్టీలో నాలుగు రోజులకు ఒకసారి, కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరులో రెండు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారు. బేతంచర్ల, చిత్తూరు, ధర్మవరం, డోన్‌, గుంతకల్లు, కదిరి, కమలాపురం, కుప్పం, మదనపల్లి, నంద్యాల, పునగనూరు, రాయచోటి, రాయదుర్గ, తాడిపత్రి, ఎర్రగుంట్ల మున్సిపాల్టీల్లోనూ తాగునీటి కొరత ఏర్పడింది. ఈ మున్సిపాల్టీలో రోజువిడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు.
చిత్తూరు కార్పొరేషన్లో 496 బోర్లు ఉన్నాయి. వాటిలో 87 బోర్లు మరమ్మతులకు గురయ్యాయి. రోజువిడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు.
కుప్పం ప్రజలకు హంద్రీ నీవా నీరు ప్రస్తుతం రావడం లేదు. కుప్పం పరిధిలో పాలూరు ప్రాజెక్టు ఉంది. మన రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి మధ్య వివాదం వల్ల ఆ నీరు మన రాష్ట్రానికి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే 0.5 టిఎంసిల నీరు వచ్చే అవకాశం ఉంది.

➡️