సీమ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం- ‘రా కదలి రా’ సభలో చంద్రబాబు

Jan 10,2024 08:33 #Chandrababu Naidu, #speech

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి:వైసిపి పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని, వైసిపి ప్రభుత్వ పతనం ఖాయమని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం ‘రా కదలిరా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసిపి పాలనలో రాతి యుగంలోకి వెళ్లామని, టిడిపి అధికారంలోకి రాగానే స్వర్ణయుగం తెస్తామని తెలిపారు. అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైసిపి పాలన పేదల పాలిట శాపంగా మారిందని, పేదలు నిరుపేదలుగా, యువత నిరుద్యోగులుగా మారిపోయారని విమర్శించారు. జగన్‌కు తెలిసింది కూల్చివేతలు, దాడులు మాత్రమేనని తెలిపారు. ప్రజా వేదికను కూల్చి విధ్వంస పాలనకు తెర లేపారని, అధికార దాహంతో తనపై తప్పుడు కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు నీళ్ళు తేవాలని ముచ్చుమర్రి ఎత్తిపోతల తీసుకొచ్చామని, గోదావరి నీళ్లు నాగార్జున సాగర్‌కు తేవాలని టెండర్లు పిలిచామని, అవి వచ్చి ఉంటే సీమకు కరువు వచ్చేది కాదన్నారు. రాయలసీమకు నీళ్లు, యువతకు ఉద్యోగాలు, పేదలకు చదువు, ఇతర మౌలిక సదుపాయాలు వస్తే రాయలసీమ రతనాలసీమ అవుతుందని, అదే తన ధ్యేయమని చెప్పారు. కర్నూలుకు హైకోర్టు బెంచి తెస్తామని, వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసి ఇంటింటికి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోయేవారు ఎవరూ లేరన్నారు. సమావేశంలో టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్‌, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌ రెడ్డి, నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌ మాండ్ర శివానందరెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు భూమా అఖిలప్రియ, గౌరుచరిత, గౌరు వెంకటరెడ్డి, బిసి జనార్ధన రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, జనసేన నాయకులు మల్లయ్య, చింత సురేష్‌ బాబు పాల్గొన్నారు.

➡️