144 సెక్షన్‌- ఇంటర్నెట్‌ కట్‌ – ‘ఢిల్లీ చలో’ ను అడ్డుకునే ప్రయత్నాలు

అంబాలా/పాటియాలా : ఓ వైపు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి రైతులు సన్నద్ధమవుతుంటే మరోవైపు దానిని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని, స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ .. 200 రైతు సంఘాలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. రైతుల నిరసన నేపథ్యంలో ముగ్గురు మంత్రులతో కూడిన బృందం చండీఘర్‌లో రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపింది.

అన్నదాతల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికార, పోలీసు యంత్రాంగం ప్రయత్నాలు చేపట్టింది. పంజాబ్‌-హర్యానా సరిహద్దును అధికారులు మూసివేశారు. అంబాలా, పాటియాలా పోలీసులు తమ తమ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. అంబాలాలోని శంభూ టోల్‌ప్లాజా సమీపంలో వాహనాలను ఆపేందుకు వీలుగా సిమెంట్‌ బారికేడ్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న పాటియాలా-శంభూ సరిహద్దు వద్ద వాహనాల రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. సరిహద్దుల వద్ద మోహరింపులను పెంచారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని హర్యానా పోలీసులు సూచించారు. అంబాల, సోనిపట్‌, పంచకుల్‌లో సెక్షన్‌ 144ను విధించారు. పోలీసు శాఖ సూచనలు అనుసరించి.. ప్రజలు తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని కోరారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు.

ఓ వైపు చర్చలకు పిలుస్తూనే .. భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : రైతు నాయకుడు జగ్‌జిత్‌ సింగ్‌

కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా వంటివి కూడా ఈ ఆందోళనలో పాల్గననున్నాయి. దీనిపై రైతు నాయకుడు జగ్‌జిత్‌ సింగ్‌ దాలెవాల్‌ మాట్లాడుతూ … ప్రభుత్వం ఓ వైపు చర్చలకు పిలుస్తూనే.. హర్యానాలో తమని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. ”సరిహద్దులు మూసేశారు. 144వ సెక్షన్‌ విధించారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. అసలు ప్రభుత్వానికి ఈ అధికారం ఉందా..? ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగవు. ప్రభుత్వం ఈ అంశంపై దఅష్టిపెట్టాలి” అని అన్నారు.

➡️