రెండోటెస్ట్‌ రెండు రోజుల్లోనే..

Jan 4,2024 22:30 #Sports

– 642బంతుల్లోనే టెస్ట్‌ ఫలితంతో టీమిండియా రికార్డు

– దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపుసిరీస్‌ 1-1తో సమం

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా దిగ్విజయంగా ముగించింది. వన్డే, టి20 సిరీస్‌లను చేజిక్కించుకున్న భారతజట్టు.. టెస్ట్‌ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకొని దిగ్విజయంగా ముగించింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 34పరుగుల తేడాతో చిత్తు ఓడిన రోహిత్‌ సేన.. రెండో టెస్ట్‌లో ఆతిథ్యజట్టుపై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో జరిగిన రెండోటెస్ట్‌ కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఫలితం వచ్చింది. దీంతో కేవలం 642బంతుల్లోనే టెస్ట్‌ ఫలితం రాబట్టిన జట్టుగా టీమిండియా ఓ రికార్డును తనపేర లిఖించుకొంది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(28), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(17నాటౌట్‌); శుభ్‌మన్‌ గిల్‌(10), విరాట్‌ కోహ్లీ(12), శ్రేయాస్‌ అయ్యర్‌(4నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, నాండ్రే బర్గర్‌, మార్కో యన్సెన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా డ్రా చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 62పరుగులతో రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 114 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. 36 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆడిన మార్‌క్రమ్‌ (106; 103బంతుల్లో 17ఫోర్లు, 2సిక్స్‌లు) సెంచరీతో ఆదుకున్నాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా(6/61) విజృంభణతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకున్నా మార్‌క్రమ్‌ మాత్రం ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ముకేశ్‌ కుమార్‌కు రెండు, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణకు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత 98పరుగులు పోను 79పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. ఆ లక్ష్యాన్ని భారత్‌ 12ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెస్టు కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలుకుదామనుకున్న డీన్‌ ఎల్గర్‌కు నిరాశే ఎదురైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మహ్మద్‌ సిరాజ్‌కు, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ బుమ్రా, ఎల్గర్‌కు దక్కాయి.

స్కోర్‌బోర్డు..

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 55ఆలౌట్‌భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 153

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (సి)రోహిత్‌ (బి)సిరాజ్‌ 106, ఎల్గర్‌ (సి)కోహ్లి (బి)ముఖేశ్‌ 12, జోర్జి (సి)రాహుల్‌ (బి)ముఖేష్‌ 1, స్టబ్స్‌ (సి)రాహుల్‌ (బి)బుమ్రా 1, బెడింగ్హామ్‌ (సి)రాహుల్‌ (బి)బుమ్రా 11, వెర్రెయనె (సి)సిరాజ్‌ (బి)బుమ్రా 9, జాన్సెన్‌ (సి అండ్‌ బి)బుమ్రా 11, మహరాజ్‌ (సి)శ్రేయస్‌ (బి)బుమ్రా 3, రబడా (సి)రోహిత్‌ (బి)ప్రసిధ్‌ 2, బర్గర్‌ (నాటౌట్‌) 6, ఎన్గిడి (సి)జైస్వాల్‌ (బి)బుమ్రా 8, అదనం 6. (36.5ఓవర్లలో ఆలౌట్‌) 176పరుగులు.

వికెట్ల పతనం: 1/37, 2/41, 3/45, 4/66, 5/85, 6/103, 7/111, 8/162, 9/162, 10/176

బౌలింగ్‌: బుమ్రా 13.5-0-61-6, సిరాజ్‌ 9-3-31-1, ముఖేశ్‌ 10-2-56-2, ప్రసిధ్‌ 4-1-27-1.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)స్టబ్స్‌ (బి)బర్గర్‌ 28, రోహిత్‌ (నాటౌట్‌) 17, శుభ్‌మన్‌ (బి)రబడా 10, కోహ్లి (సి)వెర్రెయనె (బి)జాన్సెన్‌ 12, శ్రేయస్‌ (నాటౌట్‌) 4, అదనం 9, (12ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 80పరుగులు.

వికెట్ల పతనం: 1/44, 2/57, 3/75

బౌలింగ్‌: రబడా 6-0-34-1, బర్గర్‌ 4-0-29-1, జాన్సెన్‌ 2-0-15-1.

➡️