అవమానించారంటూ కెజిబివి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Dec 11,2023 13:49 #attempt, #School girl, #Suicide

ప్రజాశక్తి-చిలమత్తూరు : పరీక్షల్లో కాపీ కొట్టి మార్కులు తెచ్చుకున్నావంటూ ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపానికిలోనై కెజిబివి విద్యార్థిని నైల్‌పాలిస్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు కెజిబివిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కెజిబివి ఎస్‌ఒ రెహానా తెలిపిన వివరాల మేరకు… చిలమత్తూరు మండల కేంద్రానికి చెందిన నవ్యశ్రీ అదే గ్రామంలోని కెజిబివిలో 10వ తరగతి చదువుతోంది. పదవ తరగతి విద్యార్థులను పరీక్షల్లో మెరుగు పరిచేందుకు ప్రభుత్వం వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి వారం ఓ పుస్తకంలో పరీక్షలు రాయిస్తూ అందులో మార్కులు వేసేవారు. అందులో భాగంగా గడిచిన శనివారం వారాంతపు పరీక్ష (తెలుగు) నిర్వహించారు. ఈ పరీక్షలో నవ్యశ్రీ కాపీ కొట్టిందని తోటి విద్యార్థినులు ఒకేషనల్‌ ఉపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా ఆదివారం విద్యార్థిని వద్ద ఉన్న పరీక్షల రాసే పుస్తకాన్ని ఉపాధ్యాయురాలు తీసుకున్నారు. సోమవారం నాడు ఈ పస్తకాన్ని ఉపాధ్యాయురాలే స్వయంగా ఇచ్చి పరీక్షను రాయించారు. పరీక్ష రాసిన అనంతరం విద్యార్థిని మరుగుదొడ్డిలోకి వెళ్లి నైల్‌పాలిస్‌ తాగింది. వెంటనే గట్టిగా కేకలే వేయడంతో కెజిబివి సిబ్బంది 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. చికిత్సలు అందించిన వైద్యులు ప్రాణాపాయం లేదని తెలిపారు. కాపీకొట్టానని విద్యార్థులు ముందు పదేపదే ఉపాధ్యాయులు అవమానించడంతోనే తాను ఆత్మహత్యకు యత్నించానని విద్యార్థిని నవ్యశ్రీ తెలిపింది.

➡️