ఉరి తాళ్లతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసన

– 14వ రోజుకు చేరిన సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం :సర్వ శిక్షా అభియాన్‌ ఉద్యోగుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె మంగళవారం 14వ రోజుకు చేరింది. మెడకు ఉరితాళ్లు వేసుకొని, కళ్లకు గంతలు కట్టుకొని నిరసనలు తెలిపారు. జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పిఆర్‌సి అమలు చేయకుండా, నెలల తరబడి వేతనాలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.విజయవాడలో ధర్నా చౌక్‌లో సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమ్మెకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు మద్దతిచ్చి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ధర్నాచౌక్‌లో మెడకు ఉరితాళ్లు వేసుకుని ఉద్యోగులు నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరాన్ని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సందర్శించి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్యలే శరణమంటూ చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఉరితాళ్లను మెడకు వేసుకుని నిరసన తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మెడకు ఉరితాళ్లు బిగించుకుని, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. విశాఖ పశ్చిమ టిడిపి ఎమ్మెల్యే పి.గణబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా కాకినాడలో, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో డిఇఒ కార్యాలయాల వద్ద సమ్మె శిబిరాలను కొనసాగించారు. కాకినాడలో ఉరితాళ్లతో నిరసన తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన, విజయనగరంలో మానవహారం చేపట్టారు. అనంతపురంలో భిక్షాటన, మెడకు ఉరితాళ్లతో, సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉరితాళ్లను మెడలో వేసుకుని నిరసన తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉరి వేసుకొంటున్నట్లు నిరసనలు కొనసాగించారు.

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 14వ రోజు మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉరి తాళ్లు మెడకు బిగించుకుని వినూత్నంగా నిరసన.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 14వ రోజు మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉరి తాళ్లు మెడకు బిగించుకుని వినూత్నంగా నిరసన.
➡️