సంబరాల సంక్రాంతి

Jan 14,2024 09:19 #Jeevana Stories

భోగి ముందు రోజు చింటూ ఫ్యామిలీ తాతయ్య ఊరు మానేపల్లి వెళ్లారు. అప్పటికే చింటూ బాబారు, పిల్లలు వచ్చి వున్నారు. అంతా కలిశారు. ‘చింటూ రేపు భోగి మంట వేయాలి. నీ కోసం కూడా పెద్ద పిడకల దండ తయారు చేయించాము’ అన్నాడు బాబారు కొడుకు బంటి. మరుసటి రోజు ఉదయమే పిల్లలతో సహా అందరూ భోగి మంటలు వేశారు. నలుగులు పెట్టుకుని స్నానాలు చేశారు. ‘నలుగు స్నానం చాలా మంచిది. ఇది చర్మాన్ని ఎంతో అందంగా వుండేలా చేస్తుంది’ అని నానమ్మ ఆ రోజు చేసే పనులన్నింటి గురించి వివరంగా చెబుతుంటే పిల్లలంతా శ్రద్ధగా విన్నారు. ఇంతలో ఆ వీధిలోకి హరిదాసు వచ్చాడు. ఆ వెనుకగా గంగిరెద్దులు, కొమ్మదాసరులు, రకరకాల పక్షి ఈకలు ధరించి కోయవాళ్ళు వచ్చారు. చింటూ వాళ్లందరినీ వింతగా, ఆశ్చర్యంగా చూశాడు. పెరట్లో పొయ్యి వెలిగించి నానమ్మ ఘుమ ఘుమ లాడే పిండి వంటలు తయారు చేసింది. చింటూకి ఆ పండుగ ఎంతో నచ్చేసింది. ఆ రాత్రి అంతా వీధిలో పెద్ద ముగ్గు వేశారు. పిల్లలు రంగులు వేశారు. అంతా కలిసి పాటలు పాడారు. రెండవ రోజు సంక్రాంతి పండుగ. తాతయ్య అందరికీ గాలి పటాలు తెచ్చారు, పిల్లలు పెద్దలు గాలి పటాలు ఎగుర వేశారు. చింటూకి ఇదంతా ఎంతో ఆనందంగా అనిపించింది. ఎప్పుడు పల్లెలో పండగకి రాలేదు. దీంతో ప్రతి ఒక్కటి తనని ఆశ్చర్యానికి గురిచేశాయి. సంక్రాంతి పండగ రోజు నానమ్మ గారెలు వేసింది. వాటితో పాటు జంతికలు, సున్నుండలు, చక్కిలాలు అన్నీ పెట్టింది. చింటూ నానమ్మని అడిగి వాటి పేర్లు తెలుసుకుని మరీ తిన్నాడు. తరువాత అంతా ఊళ్లో కబడ్డీ ్డఆడుతున్న చోటికి వెళ్లారు. అలా ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగ గడిచింది. మూడవరోజు కనుమ పండుగ. ఇంట్లో ఆవులను, గేదలను శుభ్రంగా కడిగి అలంకరిం చారు. పని ముట్లను కడిగించారు. చింటూ, బంటి ఇది కార్మిక , కర్షక పండుగ. అంటే మనకు ఈ సమయంలో పండిన పంట చేతికి వచ్చి రైతులకు, పనిచేసే వారికి ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్న మాట. ఆ రోజు అక్కడ ఎడ్ల పందేలు జరిగాయి. పనివాళ్ళందరికీ ధాన్యం, పప్పులు పంచారు చింటూ, బంటి. అంతా ఎంతో ఆనందించారు. ‘ఇలా పండుగలు చేసుకోవడం వల్ల బంధాలు బలపడతాయి. అంతా కలిసిమెలిసి వుండడం అలవడుతుంది. పక్క వారికి సహాయం చేయా లనేది తెలుస్తుంది. అదే పల్లెలో గొప్ప తనం. అదే పట్నంలో పండుగ జరుపుకున్నా ఒకరినొకరు కలవరు. ఎవరింట్లో వాళ్ళు జరుపుకునే పండుగకి, అంతా కలిసి చేసుకునే పండుగకి మధ్య తేడా తెలిసిందా చింటూ’ అన్నారు తాతయ్య. ‘ఈ పండుగ చాలా బాగా జరిగింది తాతయ్య. నేను ప్రతి ఏడాది ఇక్కడికే వస్తాను. పండుగతో పెనవేసుకున్న ఎన్నో సాంప్రదాయాలు తెలిసాయి. గాలిపటం ఎగుర వేసి జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలుసుకున్నాను. ఇవన్నీ రేపు మా స్కూల్లో స్నేహితులకు చెప్పాలి’ అంటూ పండగ ఇచ్చిన ఉత్సాహంతో బ్యాగు సర్దుకున్నాడు చింటూ.

– కూచిమంచి నాగేంద్ర, 91821 27880.

➡️