సంక్రాంతి చీర

Feb 4,2024 07:23 #Sneha, #Stories
mini katha

‘నమస్కారం అత్తయ్యగారు. అంతా క్షేమమేనా?’ అంటూ కారులో నుంచి లగేజీని ఇంటిలోకి చేర్చాడు రమేష్‌.

‘నమస్కారం బాబు! అమ్మాయేది?’ అని అడిగింది పార్వతమ్మ.

‘వచ్చిందండి. ఊరిలోకి రాగానే చౌరస్తా దగ్గర కారు ఆపమని, తను మాత్రమే దిగింది. వెంటనే వస్తాను, మీరు వెళ్ళండి అని నన్ను పంపించింది అత్తయ్య’ అన్నాడు రమేష్‌.

‘కాళ్లు కడుక్కురా బాబు. టీ తాగుదువు గాని’ అంటూ కండువా చేతికిచ్చింది ఆమె.

‘అయినా తిన్నగా ఇంటికి రావాలి గానీ కొత్త పెళ్లికూతురు ఇలా రోడ్డు మీద తిరగడమేంటి? అదీను.. మొదటి పండక్కి అమ్మగారింటికి వస్తూ’ అని దీర్ఘం తీసింది పార్వతమ్మ.

****************************************************

రమేష్‌ ఇంటి వెనుక పెరట్లో మడత కుర్చీలో కూర్చొని టీ తాగుతూ పెరట్లో పెంచిన కూరగాయల పాదులు, పూల మొక్కలు చూడసాగాడు. గుబురుగా నాలుగడుగుల పొడవు, వెడల్పు పెరిగి ఆకులు కూడా కనిపించకుండా, తెల్లని పువ్వులతో ఉన్న చెట్టు రమేష్‌ దృష్టిని ఆకర్షించింది. అది నందివర్ధనం మొక్క. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టుగా హాల్లోకి వెళ్లి గోడకు వేలాడదీసిన రమేష్‌ భార్య శైలజ ఫోటో ఫ్రేమ్‌ని చేతిలోకి తీసుకున్నాడు. వంటగదిలో గారెలు వండుతున్న పార్వతమ్మ దగ్గరకు వెళ్లి ‘అత్తయ్యా శైలజ తలలో పెట్టుకున్న పువ్వు నందివర్ధనమే కదా!’ అని అడిగాడు.

పార్వతమ్మ వెంటనే ఫోటో కేసి చూసి ‘అవును బాబు శైలజకు నందివర్ధనాలంటే చాలా ఇష్టం. స్కూల్‌కి వెళ్లే రోజుల్లో నల్ల రిబ్బన్లు వేసుకొని, ఒక నందివర్ధనం పెట్టుకొని వెళ్తుంటే ఎంతో ముద్దుగా ఉండేది. వాళ్ళ నాన్నగారు తన కూతుర్ని చూసుకొని, తెగ మురిసిపోయేవారు. దురదృష్టవంతుడు కూతురు కాపురం చూడకుండానే పోయాడు’ అని ఉద్వేగానికి లోనయ్యింది పార్వతమ్మ.

పండక్కి తెమ్మని చెప్పిన సరంజామా అంతా తెచ్చి పక్కనపెట్టి ‘బావగారూ బాగున్నారా? ఎంతసేపయ్యింది వచ్చి? ఏంటి బావా శైలు ఏది? తన ఫోటో పట్టుకుని నిలబడ్డారు ఏంటి?’ అన్నాడు రఘురామ్‌.’నడిరోడ్డున దిగిందట రా.. అమ్మాయిని తీసుకురా పో’ అని కొడుకుని పంపింది పార్వతమ్మ.

ఇంకా శైలజ ఫోటోలు ఉంటే చూపించండి అత్తయ్యా’ కుతుహలంగా అడిగాడు రమేష్‌. ‘టీవీ పక్కన అలమరాలో ఉంటాయి తీసి చూడు బాబు’ అని సమాధానం ఇచ్చి, ప్లేటులో గారెలు పెట్టుకొచ్చి రమేష్‌ చేతికిచ్చి వీధిలోకి వెళ్ళింది పార్వతమ్మ. సాయంకాలం ఐదు గంటలు దాటింది వీధుల వెంబడి ఎవరూ కనిపించట్లేదు పార్వతమ్మకి.

‘ఏంటబ్బా ఈ చిత్రం! పండగ రోజున వీధులు ఖాళీ కావడం ఏంటి?’ అని తిరిగి ఇంట్లోకి వచ్చింది. రమేష్‌ గారెలు తింటూ ఫోటో ఆల్బమ్‌ తిరగేస్తున్నాడు. ‘పెళ్లి ఆల్బమ్‌ రాలేదా బాబూ’ అంటూ అల్లుణ్ణి అడిగింది. రమేష్‌ ‘లేదు అత్తయ్యా’ అని సమాధానం ఇచ్చాడు. పార్వతమ్మ పెరట్లోకి వెళ్లి కనకాంబరాలు తెంచసాగింది. శైలజ వోణీల ఫొటోలు, చుడీదార్ల ఫోటోలు, రాఖీ పండుగ, సంక్రాంతి ఫోటోలు అన్నీ తిరగేస్తుండగా.. ఇంద్రధనస్సు రంగుతో ఉన్న చీర కట్టుకున్న శైలజ ఫోటో, వెనుక ఇంకో ఫోటో ఉన్నట్లు అనిపించి రమేష్‌ దాన్ని బయటకు తీశాడు. అది రమేష్‌ ఫోటోనే. ఈ ఫోటో నేనెప్పుడు దిగాను? చుట్టూ జనం ఉన్నారు. శైలుకి ఎలా దొరికింది? అని ఆ రెండు ఫోటోలు తన ఫ్యాంటు జేబులో పెట్టుకొని, అత్తగారి దగ్గరికి వెళ్లి ‘అన్నా, చెల్లెలు ఇప్పుడు వచ్చేలా లేరు. మసక చీకటి అవుతుంది నేను చౌరస్తా దాకా వెళ్తాను అత్తయ్యా’ అంటూ బయలుదేరాడు రమేష్‌. వీధుల్లో ఎవరూ కనపడలేదు రమేష్‌కి. చౌరస్తా దగ్గర ఊరంతా చేరినట్టు అనిపించింది.

‘కొత్తల్లుళ్లు, కొత్తకోడళ్ల పరిస్థితి ఏం పట్టించుకోరు అనుకుంటా. ఈ ఊరి జనాలు’ అని మనసులో అనుకుంటూ చౌరస్తాను చేరాడు రమేష్‌.

మాజీ సర్పంచ్‌ రమణయ్యగారి అల్లుడురా.. జరగండి’ అంటూ కొందరు, ‘ఎప్పుడొచ్చావు బాబు’ అంటూ మరికొందరు పలకరించి, ముందుకు దారి ఇచ్చారు రమేష్‌కి. గుంపును దాటేసుకొని చూసేసరికి ఇరవై ఒక్కమంది మహిళలు నేలమీద రంగులతో ముగ్గులు వేస్తూ పోటీలో పాల్గొన్నారు. అందులో రమేష్‌ భార్య శైలజ కూడా ఉంది. పక్క నుంచి మైక్‌లో పెద్ద కేక.. గ్రామ సర్పంచ్‌ గారు పది నిమిషాల్లో ముగ్గుల విజేతని ప్రకటిస్తారని. రఘురాం, రమేష్‌ దగ్గరకు చేరి ‘బావా నేను అందరివీ చూశాను. కచ్ఛితంగా మన శైలమ్మకే మొదటి బహుమతి’ అని చెప్పసాగాడు. రమేష్‌ మనసులో ‘నాకూ ఇచ్చారు బహుమతిని మీ నాన్నగారు మూడు నెలల క్రితమే. వాలు జడ సీతని, జడలో నందివర్ధనాలు పొదువుకునే బుట్ట బొమ్మని’ అని కళ్లార్పకుండా శైలజనే చూస్తూ నిలబడి పోయాడు రమేష్‌.

**********************************************************************

సర్పంచ్‌ మూర్తిగారు వచ్చి ‘మూడవ బహుమతి రథం ముగ్గు వేసిన పద్మజకు, రెండవ బహుమతి పాలకుండల ముగ్గువేసిన గిరిజకు అని, ప్రథమ బహుమతి సంక్రాంతి ముగ్గు అంటే ఇదే అనేంతగా రంగురంగుల గులాబీల ముగ్గు వేసిన శైలజకు’ అని మైక్‌లో అనౌన్స్మెంట్‌ చేయడంతో ముందుకు కదిలింది శైలజ. ఆ ముగ్గుల మధ్యన నడుస్తున్న శైలజ రంగుల ముగ్గులను సంక్రాంతి చీరగా చుట్టుకొని నడిచినట్టు కనిపించింది రమేష్‌కి. తన వివరాలు, ముగ్గు వెనుక ఉన్న ఇష్టాన్ని వివరిస్తూ.. ‘పోయిన సంవత్సరం మా నాన్నగారు సర్పంచ్‌గా ఉన్నప్పుడు, పక్క ఊరు సర్పంచ్‌గారి అబ్బాయిని ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ఇవ్వడానికి ఆహ్వానించారు. అప్పుడు నాకు ద్వితీయ బహుమతి లభించింది. రమేష్‌గారి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాను. అతనే నా భర్తగా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రథమ బహుమతి లభించడం ఇంకా సంతోషంగా ఉంది’ అని భర్త మీద ఉన్న ప్రేమని చెప్పే ప్రయత్నం చేసింది శైలజ. లోకల్‌ ఛానళ్ల వారు సంక్రాంతి సంబరాలను వీడియో తీస్తున్నారు. టీవీలో ఈ ముగ్గుల పోటీ చూస్తూ రమేష్‌ తల్లిదండ్రులు తమ కోడలు గెలిచినందుకు ఎంతో సంబరపడ్డారు.

‘భర్తతో ఏవండీ కోడలు కట్టుకున్న చీర చూస్తున్నారా.. పొద్దున పిల్లలు ఇద్దరికీ పండక్కి కట్టుకోమని బట్టలు పెట్టాం కదా! అదే కట్టుకుని వెళ్లింది. చూడముచ్చటగా ఉంది కదండి. అక్కడున్న ముగ్గులన్నింటినీ చుట్టి తనే చీర కట్టుకున్నట్టుగా’ అని మురిసిపోయింది.

శైలజ మాటలు విన్నాక రమేష్‌ని స్టేజీ మీదకి పిలిచారు సర్పంచ్‌ మూర్తి. శైలజ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యింది తన భర్త ఈ గుంపులో ఉన్నట్టు తను ఊహించలేదు. ‘రావయ్యా రమేష్‌.. మీ నాన్నగారు, నేను మంచి మిత్రులం. నువ్వు నా కొడుకులాంటి వాడివి. నువ్వే ఇవ్వు నీ భార్యకు ఈసారి మొదటి బహుమతి’ అన్నాడు. రమేష్‌ చేతుల మీద నుంచి శైలజ బహుమతి అందుకుంటుండగా అన్నయ్య రఘురాం ఫోటోగ్రాఫర్‌ని పిలిపించి, ఫోటో తీయించాడు. వీళ్లు ముగ్గురూ ఇల్లు చేరేలోపే ఇంటి గుమ్మం ముందు రెడీగా నిలుచుంది మూతి ముడుచుకొని, పార్వతమ్మ.

అమ్మా! అని శైలజ పిలుస్తుంటే పార్వతమ్మ పట్టనట్టుగా.. ‘అల్లుడుగారు నాలుగు గంటలకు ఇంటికి వస్తే, నువ్వు ఎనిమిది గంటలకా వచ్చేది. ఈ చీకట్లో… స్నానాలు చేసి రండి, నాకు ఆకలేస్తుంది’ అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది.

‘సర్లే కానీ.. నువ్వు వేసిన ముగ్గు గెలిచిందా? నువ్వు కట్టుకున్న చీర గెలిచిందా?’ అని రమేష్‌ చమత్కారంగా శైలజ వైపు చూస్తూ అన్నాడు.రఘురాం.. ‘బావా! నువ్వు వేయకూడని ప్రశ్న వేశావు నేను తప్పుకుంటున్నాను’ అని బాత్రూంలోకి దూరాడు.

‘మీ పని చెప్తా రండి, లోపలికి రండి, ఇది మా ఊరు, మీరు ఎక్కడికీ వెళ్లలేరు’ అంటూ ఇంట్లోకెళ్ళింది శైలజ. వెనకాలే అనుసరించాడు రమేష్‌. గడియపెట్టి, తన ప్యాంటు జేబులో ఉన్న శైలజ దాచుకున్న రమేష్‌ ఫోటోని చూపించాడు. ‘దానికి బదులుగా.. ఇందాక స్టేజీ మీద చెప్పాను కదా! పోయిన సంవత్సరం మీరు వచ్చారు, నాకు ఫ్రైజ్‌ ఇచ్చారు అని’ పలికింది శైలజ. ‘ఇస్తే.. ఫోటోను కూడా మీ వెంట తెచ్చుకుంటారా?’ అని రమేష్‌ అన్న దానికి, ‘నేనేం తెచ్చుకోలేదు!’ అని బుంగమూతి పెట్టి ‘మా నాన్నగారు తెచ్చారు. చివరికి ఇలా నా జీవితానికి ఇచ్చారు!’ అని సిగ్గుపడింది శైలజ.

తెల్లవారుజామున, సంక్రాంతి రోజున రమేష్‌ ప్యాంటు జేబులో దాచుకున్న ఫోటోలో కనిపించే ఇంద్రధనస్సు చీరకట్టి, నందివర్ధనం, కనకాంబరాలు జడలో పెట్టుకొని, శైలజ ముగ్గేస్తూ దర్శనమిచ్చింది రమేష్‌కి. ‘మా ఇద్దరి ఊహలు ఒకే పక్షికి రెక్కలు కట్టుకొని ఎగిరాయా.. లేదా నా ఫ్యాంటు జేబులో ఉన్న ఫోటో చూసి ఈ చీర కట్టుకుందా!’ అని రమేష్‌ మనసులో అనుకుంటూ శైలజ దగ్గరకు వెళ్లాడు.

‘నువ్వు వేయడం వల్ల ముగ్గుకి, నువ్వు కట్టుకోవడం వల్ల చీరకి, చివరగా నువ్వు పెట్టుకోవడం వల్ల నందివర్ధనం పువ్వుకి అందం వచ్చింది!’ అంటూ ప్రేమ కవిత్వం చెప్తూ ‘ఇంద్రధనస్సు చీర కట్టి .. చంద్ర వదన చేర వస్తే ..’ అనే పాత పాట పాడుకుంటూ లోలోన మురిసిపోయాడు.

  • మృదుల పి, 70934 70828
➡️