పశ్చిమబెంగాల్‌ నూతన డిజిపిగా సంజయ్ ముఖర్జీ

న్యూఢిల్లీ :    ఐపిఎస్‌ అధికారి సంజయ్  ముఖర్జీని పశ్చిమ బెంగాల్‌ నూతన డిజిపిగా భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) మంగళవారం నియమించింది.  పశ్చిమబెంగాల్‌ డిజిపి రాజీవ్‌ కుమార్‌ సహా ఏడు రాష్ట్రాల ఉన్నతాధికారులను ఎన్నికల సంఘం సోమవారం తొలగించిన సంగతి తెలిసిందే.   రాజీవ్‌ కుమార్‌ బదిలీ అయిన కొన్ని గంటల అనంతరం పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం వివేక్‌ సహాయ్‌ను  నూతన డిజిపిగా నియమించింది.  అయితే  కొన్ని గంటల్లోనే ఎలక్షన్‌ కమిషన్‌ సంజయ్  ముఖర్జీని నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

డిజిపిగా సంజయ్  ముఖర్జీ పేరును కమిషన్‌ ఆమోదించిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపిన మెమోలో ఇసిఐ కార్యదర్శి  పేర్కొన్నారు.  ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, సాయంత్రం 5.00 గంటలలోపు నియామకం చేపట్టాలని ఆదేశించారు.

డిజిపిగా సీనియారిటీని అనుసరించి వివేక్‌ సహాయ్‌ను  రాష్ట్ర ప్రభుత్వం నియమించినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికలు ముగిసేనాటికి మే చివరి వారంలో ఆయన పదవీవిరమణ చేయనున్నారని ఇసిఐకి చెందిన  సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  దీంతో ఎన్నికల కమిషన్‌ ముఖర్జీని డిజిపిగా నియమించిందని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన కొన్ని రోజులకే రాష్ట్ర పోలీస్‌ శాఖలో మార్పులు చేపట్టడం గమనార్హం. రాజీవ్‌ కుమార్‌ మూడు నెలల క్రితమే డిజిపిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

➡️