ఇసుక, మాంగనీస్‌ మైన్స్‌ రెన్యువల్‌ చేయాల్సిందే..

  • విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట విశాఖ ఉక్కు కార్మికుల ధర్నా

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి /కోట : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ఇసుక, మాంగనీస్‌ ఓర్‌ తవ్వకాల అనుమతులను రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా జరిగింది. సంఘం నాయకులతో పాటు ఉక్కు కార్మికులు వందలాది కార్లలో తరలివచ్చారు. వీరికి విజయనగరం జిల్లాకు చెందిన సిఐటియు, ఎఐటియుసి తదితర ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు వై జంక్షన్‌లో స్వాగతం పలికారు. అక్కడి నుంచి సంతకాల వంతెన, ఆర్‌అండ్‌బి జంక్షన్‌ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. ప్లకార్డులు చేతబూని, ప్రభుత్వం, అధికారుల వైఖరికి నిరసనగా చేసిన నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ఇన్‌గేట్‌ను పోలీసులు కొద్దిసేపు మూసివేశారు. ధర్నా అనంతరం డిఆర్‌ఒ అనితకు, మైన్స్‌ ఎడికి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. అనంతరం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ, కో- కన్వీనర్‌ అయోధ్యరామ్‌ మాట్లాడుతూ లక్షలాది మందికి ఉపాధి కల్పించే స్టీల్‌ప్లాంట్‌కు విజయనగరం జిల్లాలోని సారిపల్లి చంపావతి తీరంలోని ఇసుక, గరివిడి మండలం గర్భాంలోని మాంగనీస్‌ దశాబ్దాల తరబడి వస్తున్నాయని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశాన్ని కార్మికులు అడ్డుకోవడంతో ఏడాదిన్నర క్రితం ముగిసిన గనుల అనుమతులను రెన్యువల్‌ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపేశాయని విమర్శించారు. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదని, లీజు కాలపరిమితి ముగిసిన వెంటనే అధికారులు రెన్యువల్‌ చేసేవారని తెలిపారు. దీనివల్ల స్టీల్‌ప్లాంట్‌ మనుగడ కష్టతరంగా మారుతోందని, ఫలితంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధికి భవిష్యత్తులో గండిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ కుదేలైతే ఆ సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే ఆర్థిక వనరులూ తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ నాయకులు రామస్వామి, వైటి దాస్‌, ఎన్‌ రామచంద్రరావు, రామేశ్వరరావు, కోటేశ్వరరావు, మోహనరావు, సత్యనారాయణ, విజయనగరం సిఐటియు ప్రధాన కార్యదర్శి కె సురేష్‌, నాయకులు రెడ్ది శంకరరావు, యుఎస్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️