ఇజ్రాయిల్‌ కట్టుబడి వుండేలా ఆంక్షలు

Feb 17,2024 08:23 #israel hamas war, #Palestine
Sanctions that Israel must abide by

 అంతర్జాతీయ సమాజానికి పాలస్తీనా విజ్ఞప్తి

గాజా : ఇజ్రాయిల్‌ కట్టుబడి వుండేలా, తప్పనిసరిగా అమలు చేసేలా కఠినమైన ఆంక్షలు విధిస్తే తప్ప గాజాలో ఈ మారణ హోమం ఆగదని పాలస్తీనా అథారిటీ (పిఎ) పేర్కొంది. అమాయకులైన పౌరుల ప్రాణాలు కాపాడాలని పిలుపులు ఇస్తే జరిగిదేమీ వుండదని, దాంతోపాటు కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలు విధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. బతకడానికి అవసరమైనవేవీ ఇవ్వకుండా 20లక్షల మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ బందీలుగా అదుపులోకి తీసుకుందని విమర్శించింది. కాల్పుల విరమణ పాటించాలని, పౌరుల ఊచకోత ఆపాలని అంతర్జాతీయంగా ఎన్ని విజ్ఞప్తులు, హెచ్చరికలు వచ్చినా వాటిని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు బేఖాతరు చేస్తున్నారని పేర్కొంది. తమ ప్రజలను బందీలుగా చేసి, వారిని ఆకలితో మాడ్చి చంపుతూ, వారి మాతృభూమి నుండే వారినే వెళ్ళగొట్టేలా చేస్తున్నారని పిఎ విమర్శించింది. ఇజ్రాయిల్‌ దురాక్రమణ చర్యలను ఆపేసేలా ఒత్తిడి తీసుకురాగలిగే, వాటికి కట్టుబడి వుండేలా ఐక్యరాజ్య సమితి తీర్మానాలను అంతర్జాతీయ సమాజం ఆమోదించాలని కోరింది.

చిన్నాభిన్నమైన అంతర్జాతీయ వ్యవస్థే ఇందుకు కారణం : యుఎన్‌ చీఫ్‌

గాజాలో సాగుతున్న నరమేథం చిన్నాభిన్నమైన ప్రపంచ వ్యవస్థను నొక్కి చెబుతోందని ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటానియో గుటెరస్‌ వ్యాఖ్యానించారు. గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా వున్నాయని, అక్కడ సాగుతున్న విధ్వంస కాండ, మరణాలు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయని, ఈ యుద్ధం సరిహద్దులు దాటి కూడా విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా స్పందించలేకపోవడానికి అంత ర్జాతీయ సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్టంభనే కారణమన్నారు. మ్యునిక్‌ భద్రతా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

నాసర్‌ ఆస్పత్రిపై దాడిలో ఆరుగురు రోగులు మృతి

ఖాన్‌ యూనిస్‌లోని నాసర్‌ ఆస్పత్రిపై ఇజ్రాయిల్‌ బలగాలు విచక్షణారహితంగా జరుపుతున్న దాడుల్లో ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్‌ను, ఆక్సిజన్‌ సరఫరాలను నిలిపివేయడంతో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు మరణించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

➡️