జోరుగా మైనర్లకి మద్యం, మత్తు పదార్థాల అమ్మకాలు !

Jan 30,2024 13:21 #alcohol, #Drugs, #minors, #Sales

ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మైనర్‌ బాలురు మద్యానికి అలవాటు పడి, మద్యం, నిషేధిత కైనీ, గుట్కా, పాన్‌పరాగ్‌ వంటి వాటిని ఉపయోగించి రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో గుంపులుగా చేరి రహదారుల వెంబడి వచ్చే పోయే వారితో అసభ్యంగా ప్రవర్తించడం సాధారణంగా మారింది. ముఖ్యంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు రాత్రి వేళల్లో ట్యూషన్‌ కి వెళ్లి ఇంటికి రావాలంటే చాలా భయంతో బెంబేలెత్తిపోతున్నారు. విద్యార్థినిలతో పాటు కుటుంబ సభ్యులు ఎవరైనా తోడు ఉంటే తప్ప ట్యూషన్‌ కి వెళ్ళి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య ఏర్పడటానికి ఎక్కువ భాగం మైనర్‌ బాలురు మత్తు పదార్థాలు వినియోగించి ఆ మత్తులో మునిగి కొన్ని కూడళ్లలో చేరి సంఘ విద్రోహ శక్తులులా మారుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ఎక్కువగా మండల కేంద్రంలో కనిపించడం ఆందోళన కలిగించే విషయం.

షాపుల్లో నిషేధిత మత్తు పదార్థాలు విక్రయాలు :

మండలంలో కొన్ని బడ్డీ కొట్లు, షాపుల్లో నిషేధిత మత్తు పదార్థాలు యధేచ్ఛగా, జోరుగా విక్రయాలు సాగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మండల కేంద్రంలో ఉన్న ప్రధాన సెంటర్లో ఉన్న కొన్ని షాపుల్లో యధేచ్ఛగా మత్తు పదార్థాల అక్రమంగా నిల్వలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . మైనర్‌ బాలురకు మత్తు పదార్థాల విక్రయాలు అడ్డుకునేందుకు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అలాగే రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో గుంపులుగా చేరే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఎస్సై వివరణ :

మైనర్‌ బాలురకు మత్తుపదార్థాలు, మద్యం విక్రయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని సిఐ కిషోర్‌ బాబు చెప్పారు. మండలంలో ఉన్న మద్యం షాపుల నుంచి మైనర్‌ బాలురకు మద్యాన్ని విక్రయించొద్దని ఆదేశాలు జారీ చేశామని, అలాంటివారు ఎవరైనా ఉంటే తమకు సమాచారం అందజేయాలని తెలిపినట్లు ఎస్సై శ్రీను అన్నారు. అలాగే రాత్రి వేళల్లో గుంపులుగా ఉండే అనుమానాస్పద వ్యక్తుల కోసం గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

➡️