నెల్లూరులో సైరా!

Apr 13,2024 00:41 #Saira in Nellore!

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :నెల్లూరు జిల్లాలో హోరాహోరీ ఎన్నికల వేడి సాగుతోంది. టిడిపి, వైసిపి నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జిల్లాలో ఒక పార్లమెంటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి టిడిపి తరపున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైసిపి తరపున విజయసాయిరెడ్డి పోటీ పడుతున్నారు. ఇద్దరు ఎంపిలు నెల్లూరు జిల్లా వాసులే. ఇద్దరు నెల్లూరు పెద్దారెడ్లు, ఆర్థికంగా బలమైన వ్యక్తులు రావడంతో రాష్ట్ర రాజకీయాలు మొత్తం సింహపురి వైపు చూస్తున్నాయి. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బడా వ్యక్తులు పోటీపడుతున్నారు. నగదు వరదల్లా పారుతుంది. కందుకూరు టిడిపి అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు, వైసిపి అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌యాదవ్‌, ఇండియా ఫోరం అభ్యర్థిగా గౌస్‌మొహిద్దీన్‌ రంగంలో ఉన్నారు. టిడిపి అభ్యర్థి కొత్తవారు కావడంతో సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్‌, పోతుల రామారావు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఇంటూరి సోదరుడు ఇంటూరి రాజేష్‌ కూడా వ్యతిరేకిస్తున్నారు. టిడిపికి అనుకూల పరిస్థితులున్నప్పటికీ గ్రూపులతో ఇబ్బందులు పడుతున్నారు. వైసిపి అభ్యర్థిగా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ కందుకూరు నుంచి పోటీలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నా మౌనంగా ఉన్నారు. కావలి నుంచి వైసిపి అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, టిడిపి నుంచి కొత్త అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. నిన్నటి వరకు వైసిపికి దూరమైన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, మల్లెమాల సుకుమార్‌రెడ్డి వైసిపిలో చేరారు. దీంతో ఆ పార్టీకి కొంత కలిసి వచ్చింది.
టిడిపి కొత్త అభ్యర్థికి టికెట్‌ ఇవ్వడంతో కొందరు నాయకులు కావ్యకృష్ణారెడ్డికి అనుకూలంగా పనిచేయడం లేదని తెలుస్తోంది. ఉదయగిరి నుంచి టిడిపి తరపున ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌, వైసిపి తరపున మేకపాటి రాజారెడ్డి పోటీ పడుతున్నారు. ఇద్దరు కొత్త అభ్యర్థులే. టిడిపిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గ్రూపు కాకర్ల సురేష్‌కు సహకరించడం లేదు. స్థానికంగా సమన్వయ లోపం కనిపిస్తుంది. వైసిపి అభ్యర్థి విషయంలో మేకపాటి కుటుంబంలో విభేదాలున్నాయి. ఇండియా ఫోరం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌కుమార్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఆత్మకూరు నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టిడిపి తరపున రంగంలో ఉన్నారు. ప్రస్తుతం వైసిపి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీలో ఉన్నారు. విక్రమ్‌రెడ్డి గత కొంత కాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. నిన్నమొన్నటి వరకు వెంకటగిరి నుంచి పోటీ చేస్తారని భావించారు. అందువల్ల ఆనం రామనారాయణరెడ్డి పెద్దగా నియోజకవర్గంలో తిరగలేదు. ఇటీవల ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఇండియా ఫోరం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి చేవూరు శ్రీధర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. కోవూరు వైసిపి నుంచి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పోటీలో ఉన్నారు. కొత్త అభ్యర్థిగా టిడిపి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రావడంతో ప్రసన్నతోపాటు నడిచిన అనేకమంది నేతలు టిడిపిలో చేరారు. నెల్లూరు టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి పి నారాయణ పోటీలో ఉన్నారు. వైసిపి నుంచి కొత్త అభ్యర్థి ఖలీల్‌ అహ్మద్‌ పోటీ చేస్తున్నారు. ఈయన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ అనుచరుడు. నెల్లూరు రూరల్‌ టిడిిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైసిపి అభ్యర్థిగా ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. సర్వేపల్లి టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైసిపి అభ్యర్థిగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇరుపార్టీలు నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం నువ్వానేనా అన్నట్లు సింహపురి రాజకీయం సాగుతోంది.

➡️