సమానత కోసం సేఫ్‌

Safe for equality story

SAFE (Step Ahead For Equality) ‘మహిళల రక్షణ సామాజిక బాధ్యత’ నినాదంతో ఏర్పడినది. పసిపిల్లల నుండి వృద్ధుల వరకూ వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలకు, అఘాయిత్యాలకు, అవమానాలకు గురవుతున్నారు. సంఘటన జరిగినప్పుడు నిరసన ప్రదర్శనలు, ఆందోళన చేపట్టడం ద్వారా సమస్యలు పరిష్కారం కావటంలేదు. ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నాయి. సమస్యల సమూల పరిష్కారం కొరకు సరైన చర్యలు చేపట్టడం లేదు. ఒక నిర్దిష్ట కార్యాచరణ లేదు.

మహిళల సమస్యలు సమానత్వం, ఆర్థిక సాధికారతతో ముడిపడి వున్నవి. విద్య, ఉద్యోగం, సామాజిక, ఆర్థిక అంశాల్లో పరిమితమైన అవకాశాలు, మూఢ నమ్మకాలు, సనాతన ఆచార వ్యవహారాలు సమానత్వ సాధనకు తీవ్ర అవరోధాలవుతున్నవి.

వివక్ష ఇంటి నుండి మొదలై సమాజంలో పురుషులు ఉన్నతులుగా, నిర్ణయాధికారులుగా భావించబడుతున్నారు. ఆ భావం మనలో ఏ స్ధాయిలో నాటుకుపోయిందంటే చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగస్థులు ఉపాధ్యాయులు సైతం ఇంటిలో, సమాజంలో వివక్షను ”ఏ కొద్దిమంది మహిళలు మాత్రమే గురవుతున్నారు” అన్న భావనలో ఉన్నారు. చాలా సందర్భాల్లో వివక్షను గుర్తించటానికి కూడా సిద్ధపడటం లేదు. ఏం చదవాలో, ఏం ఉద్యోగం చేయాలో, ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలో, ఎప్పుడు పిల్లలని కనాలో, ఇంటిలో ఆర్థిక విషయాలు మొదలైన అంశాల్లో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవటం సాధారణమైన విషయంగా చూస్తున్నారు.

అంతేకాక మనుధర్మశాస్త్ర ప్రభావం, పురుషాధిక్య భావజాలం కూడా మనల్ని శాసిస్తున్నది. కూరలో ఉప్పు తగ్గినా, అనుమతి లేకుండా బయటకు వెళ్ళినా, అత్తింటి వారి ఇష్టాఇష్టాలకు లోబడి పుట్టింటి వారితో సంబంధబాంధవ్యాలు నెరిపినా, భర్త భార్యను కొట్టటం మొదలైన చర్యలు తప్పు కాదు అన్న భావం విద్యార్థుల నుండి పెద్ద వారి దాకా సమాజంలో అనేక మంది భావిస్తున్నారు.

మూఢాచారాల ప్రభావం కూడా తీవ్రంగానే వుంది. బహిష్టు సమయంలో విడిగా వుండటం, ఆ విషయాల గురించి బహిరంగంగా మాట్లాడకూడదు అనుకోవటం, బాల్య వివాహాలు, వితంతుక్రతువులు, భర్త చనిపోయిన వారు శుభకార్యాలకు హాజరు కాగూడదని ఇలా అలవాటైపోయిన అశాస్త్రీయ, అనాగరిక అంశాలు సమాజంలో ఇంకా ఆచరిస్తున్నారు. ఈ ఆలోచనలు, అభిప్రాయాలు, ఆచరణలు స్త్రీల వెనుకబాటు తాపానికి ముఖ్య కారణం.

ఇలాంటి భావజాలం మారకుండా సమానత్వం గురించి ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. ఒక కల్పనా చావ్లా, మేరీ కోమ్‌, కిరణ్‌ బేడీ, శాంతా సిన్హా, వనజా అయ్యంగార్‌, సింధు, కోనేరు హంపీ, జ్యోతి సురేఖ లాంటి వారిని చూపి మహిళలు కూడా బాగానే అభివృద్ధి చెందుతున్నారు అనుకుంటున్నారు.

జనాభాలో సగభాగంగా వున్న మహిళల్లో వీరి శాతం ఎంత అనేది లెక్క చూసుకోవటం లేదు. చదువులు మధ్యలో ఆపేసి పెళ్ళిళ్ళు చేయటం చూస్తున్నాం.. పిల్లల-పెద్దల ఆలనాపాలన పేరుతో ఉద్యోగాలు, చేస్తున్న వృత్తులను మానేసేవారు అనేక మంది.. సంపాదించిన సంపాదన మీద అధికారం లేని ఉద్యోగినులు ఎందరో. ఇవి ”సేఫ్‌” గా మేము చేసే కార్యక్రమాల సందర్భంగా గమనించిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి.

ఈ నేపథ్యంలో SAFE (Step Ahead For Equality) ఇంటా బయటా సమానత కోసం, వివక్షతను రూపుమాపడానికి, అన్నింటా సమాన అవకాశాలు అందిపుచ్చుకోటానికి, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కావటానికి దోహదపడేలా విద్యార్థులు, యువతలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నది.

”మహిళల రక్షణ సామాజిక బాధ్యత” నినాదంతో నగరంలో వున్న ప్రముఖులు, కాలేజీ ప్రిన్సిపాల్స్‌, లెక్చరర్స్‌, విద్యార్థులు, న్యాయవాదులు, ఇతర రంగాలలో పెద్దలతో కూడిన 65 మంది కమిటీతో ”సేఫ్‌” పనిచేస్తున్నది. 18 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో వున్న దాదాపు అన్ని కాలేజీల్లో ”సేఫ్‌” కమిటీలు వేయటం, తద్వారా పై అంశాల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం.

అవగాహనా సదస్సులు, సెమినార్లు, గెస్ట్‌ లెక్చర్లు, వివక్షత, అసమానత, విభిన్న రంగాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ అంశాల్లో వక్తృత్వం, ఏకపాత్రాభినయం, లఘునాటికలు, నాటికలు, పర్సనాలిటీ కాంటెస్ట్‌, ఫ్లాష్‌ మాబ్‌ తదితర రూపాల్లో నగర స్థాయిలో, కాలేజీల స్థాయిలో పలుమార్లు పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

”మహిళల రక్షణ సామాజిక బాధ్యత” నినాదంతో నగరంలో నిర్వహించిన సదస్సు, ”2కె వాక్‌” నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా సమస్యలపై చర్చకు ఆస్కారం ఇచ్చింది. బిల్కిస్‌ బానో కేసులో ఆమెకు జరిగిన తీవ్ర అన్యాయానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించి, సిద్ధార్థ లా కాలేజీలో అన్ని కాలేజీల విద్యార్థి ప్రతినిధులతో సదస్సు నిర్వహించాం. ఈ సదస్సులో రిటైర్డ్‌ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ గోపాల్‌గౌడ్‌ ఆన్‌-లైన్‌లో చేసిన ప్రసంగం, ఇతరుల ప్రసంగాలు విద్యార్థులలో సమస్య తీవ్రత పట్ల ఆలోచనను రేకెత్తించింది. నిందితులకు ఇచ్చిన క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థులలో ఒక నమ్మకం కల్గించింది.

పన్నెండు మంది కాలేజీ ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్న వేదికపై నగరంలోని 22 కాలేజీలలో ఏర్పడిన విద్యార్థి కమిటీల సభ్యులు సుమారు 800 మంది విద్యార్థులు ఉమెన్స్‌ సెల్‌ ఎస్‌.పి శ్రీమతి సరిత గారి చేతుల మీదుగా ”సేఫ్‌” బ్యాడ్జీలు అందుకోవటం గౌరవంగా భావించటమే కాక తదుపరి కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించటంలో చురుకుగా పాల్గొంటున్నారు.

బాల బాలికల్లో, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించటానికి నిర్వహించిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో స్త్రీల సమానత, మూఢాచారాలు, శాస్త్రీయ దృక్పథంపై విద్యార్థులు అనేక విలువైన సూచనలు, పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్స్‌ చేసారు.

నగరంలో జరిగిన 34వ పుస్తక ప్రదర్శనలో వివిధ కాలేజీల నుండి విద్యార్థులు ”సేఫ్‌” వేదికపై వివక్షకు వ్యతిరేకంగా కళా రూపాలు ప్రదర్శించటం ద్వారా తాము స్త్రీల సమానతకు అనుకూలమని చాటి చెప్పారు.

హింసకు వ్యతిరేకంగా నిర్వహించిన మానవహారం, పి.వి.పి మాల్‌లో ప్రదర్శించిన ఫ్లాష్‌ మాబ్‌ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..

ఫ్యామిలీ కోర్ట్‌ జడ్జి ఇందిరా ప్రియదర్శిని, ఎన్‌.టి.ఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీ రావు, ఉమెన్‌ సెల్‌ ఎస్పీ సరిత, లా కాలేజీ ప్రిన్సిపాల్‌ దివాకర్‌బాబు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌, సామాజిక కార్యకర్త దేవి, ఎన్‌టిఆర్‌ జిల్లా డిసిపి విశాల్‌ గున్నీ, SAFE జనజు వైస్‌ చైర్మన్‌ కె. రామమోహనరావు, ప్రముఖ వైద్యులు డా. కృష్ణారెడ్డి తదితరులు పలుమార్లు వివిధ సదస్సులలో, కార్యక్రమాల్లో పాల్గొని ”సేఫ్‌” కార్యక్రమాలను శ్లాఘిస్తూ, అసమానత రూపుమాపాల్సిన అవసరాన్ని చెప్తూ ”సేఫ్‌” తో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

కృష్ణా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ శ్రీ కె.బి. చంద్రశేఖర్‌గారు లోగో ఆవిష్కరిస్తూ యూనివర్సిటీ క్యాంపస్‌లో కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్తూ నగరంలో అనుబంధ కాలేజీలకు ”సేఫ్‌” తో కలిసి ప్రోగ్రామ్స్‌ చేయాలని ఉత్తర్వులు ఇవ్వటం ద్వారా అన్ని కాలేజీల్లో స్త్రీల సమస్యలపై సందర్భోచితంగా సదస్సులు పెడుతున్నారు.

మహిళల సమస్యలు సామాజిక సమస్యలుగా, మహిళల హక్కులు మానవ హక్కులుగా గుర్తించటమే కాక వాటిని అమలు చేయటానికి ”సేఫ్‌” కార్యక్రమాలు విద్యార్థులను యువతను కార్యోన్ముఖులను చేస్తున్నవి. సమాజంలో వున్న మనుధర్మశాస్త్ర ప్రభావం, పురుషాధిక్య, మూఢాచార భావజాలం మహిళలను సాధికారతకు దూరం చేస్తున్నాయి. వీటి నుండి బయట పడనిదే స్త్రీలు అభివృద్ధి చెందలేరు. అందుకై వీటికి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనందరిదీ. ”సేఫ్‌” ఆ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది.

– జి. జ్యోత్స్న, సేఫ్‌ ప్రెసిడెంట్‌, 93921 02171

➡️