ఉద్యమ బాటలో ఆర్‌టిసి ఉద్యోగులు

Jan 1,2024 10:53 #APSRTC, #Employees, #problems, #SWF
swf apsrtc protest for demands

 

విలీనం తర్వాత పెరిగిన కష్టాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్‌టిసి ఉద్యోగులు ఉద్యమ బాటకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో ఆర్‌టిసిలో వున్న ఉద్యోగులను సాంకేతికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం తప్ప కొత్తగా ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గతంలో వున్న అలవెన్సులు, ప్రోత్సాహకాలు, మెరుగైన హెచ్‌ఆర్‌ పాలసీ, వైద్య సౌకర్యం వంటి వాటికి కోత పడటంతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసిలో వున్నపుడు ఉద్యోగికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, క్రమశిక్షణ చర్యలకు గురైనప్పుడు నేరుగా యజమాన్యంతో చెప్పుకుని పరిష్కరించుకునే వెసులుబాటు వుండేది. ఇపుడు ఆర్‌టిసి ఎమ్‌డికి వినతి ఇచ్చినా ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పడం తప్ప పరిష్కారానికి చొరవ తీసుకునే వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విలీనం కాగానే ఆర్‌టిసి ఉద్యోగులందరికీ పాతపెన్షన్‌ విధానం అమలవుతుందని ఆశించారు. ఒపిఎస్‌ ఇవ్వలేమని సిపిఎస్‌ గానీ జిపిఎస్‌ను గానీ తీసుకోవాలని యాజమాన్యం చెబుతోంది. సిపిఎస్‌, జిపిఎస్‌ కంటే ఇపిఎఫ్‌ ద్వారా వచ్చే పెన్షన్‌ మేలని ఉద్యోగులు ఎక్కువ మంది అటువైపు మొగ్గుచూపుతున్నారు. అలాగే సరెండర్‌ లీవులకు సంబంధించి 2017 నుంచి 2020 వరకు వున్న బకాయిలను ఎత్తేసిన ప్రభుత్వం ఆ తర్వాత కూడా దాదాపు రూ.350 కోట్లు పెండింగ్‌ పెట్టేసింది. అన్ని ప్రభుత్వ శాఖల తరహాలో ఉద్యోగోన్నతులు వస్తాయని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 8వ తరగతి అర్హతతో డ్రైవర్‌, 10వ తరగతి అర్హతతో కండక్టర్లు ఆర్‌టిసిలో ఎక్కువగా వున్నారు. ఎడిసి, ట్రాఫిక్‌లలో ఇచ్చే ఉద్యోగోన్నతుల్లో ఇప్పటి వరకు సగటున 25 ఏళ్లుదాటిన డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగోన్నతులు లభించేవి. ప్రభుత్వంలో విలీనం అయ్యాక ఎడిసి పోస్ట్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుతో సమానమని, డిగ్రీ వుంటేనే ఉద్యోగోన్నతి అంటూ ఆర్‌టిసి యజమాన్యం చెప్పడంతో ఆర్‌టిసిలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. విద్యార్హతతో ప్రమేయం లేకుండా పాతపద్ధతిలో ఉద్యోగోన్నతుల అవకాశం కల్పించాలనే వారి డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టిసిలో పాత నిబంధనలతోనే ఉద్యోగోన్నతులు కల్పించేలా ఉత్తర్వులిచ్చింది. అయితే క్రమశిక్షణ చర్యలకు గురైన వారికి ఉద్యోగోన్నతి లేదనే నిబంధన పెట్టడంతో మెజారిటీ డ్రైవర్లు, కండక్టర్లు ఉద్యోగోన్నతులకు నోచుకోవడం లేదు. అలాగే అలవెన్సుల అంశంలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. కార్పొరేషన్‌లో వున్నపుడు ఆర్‌టిసి సొంత ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందేవి. అక్కడ అందుబాటులో లేని చికిత్సలను ప్రైవేటు ఆస్పత్రుల్లో పొందేవారు. ఇపుడు ప్రభుత్వం హెల్త్‌కార్డుల ద్వారా సేవలు అందిస్తామని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం చాలా ఆస్పత్రుల్లో ప్రభుత్వ హెల్త్‌కార్డులకు వైద్యం అందడం లేదు. అలాగే ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క బస్సునూ కొనుగోలు చేయకుండా హైర్‌ బస్సులను ప్రవేశపెట్టడం, అవసరమైతే బస్సు సర్వీసులను ప్రభుత్వం రద్దు చేస్తుండటంతో ఆర్‌టిసి మనుగడపైనా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఎస్‌డబ్ల్యుఎఫ్‌, ఎన్‌ఎంయు ఆందోళనలు చేయడంతోపాటు భవిష్యత్తు కార్యాచరణ చేపట్టాయి.

➡️