సమస్యాత్మక గ్రామాల్లో ఎస్‌పి పర్యటన

Apr 10,2024 21:45

 ప్రజాశక్తి – భోగాపురం  :  మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో జిల్లా ఎస్‌పి ఎం.దీపిక బుధవారం పర్యటించారు. పోలిపల్లి, లింగాలవలస గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలింగు కేంద్రం వద్ద భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించి, పోలింగు రోజున చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగు కేంద్రంలో 100 మీటర్లు దూరం వరకు రాజకీయ పార్టీలకు చెందిన ఎటువంటి టెంటులు లేకుండా చూడాలని తెలిపారు. అనంతరం భోగాపురం పోలీసు స్టేషను ను ఆకస్మికంగా సందర్శించారు.రికార్డులు, సిడి ఫైల్స్‌ తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మండలంలోని అన్ని సమస్యాత్మక గ్రామాల్లోను ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాలన్నారు. సమస్యలు సష్టించే వ్యక్తులను గుర్తించి బైండోవర్‌ చేసి తాహశీల్దారు కార్యాలయాల్లో వారిని హాజరుపరచి మంచి ప్రవర్తన కొరకు బాండులను తీసుకోవాలని అన్నారు. మండలంలో ప్రహరీ గోడలు లేని పోలింగు కేంద్రాలను గుర్తించి, ఆయా పోలింగు కేంద్రాల వద్ద మరింత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎస్‌పి వెంట డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు, భోగాపురం సిఐలు రవికుమార్‌, బి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐలు పి.సూర్యకుమారి, సిబ్బంది ఉన్నారు. క్షణ్ణంగా వాహన తనిఖీలు చేయాలని ఆదేశం డెంకాడ : వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్‌పి ఎం.దీపిక సూచించారు. బుధవారం డెంకాడ మండలం మోదవలస వద్ద సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన అంతర జిల్లా చెక్‌ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌ పోస్టు వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది, కేంద్ర పోలీసు బలగాలు చేపడుతున్న వాహన తనిఖీలను పరిశీలించారు. తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని, పరిమితికి మించి నగదు పట్టుబడితే సీజ్‌ చెయ్యాలని, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినియోగించే గిప్ట్స్‌, మద్యం, సారా, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాహనాల రికార్డులు, పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి పత్రాలను పరిశీలించాలన్నారు. ఎస్‌పి వెంట విజయనగరం డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు, భోగాపురం సిఐ రవికుమార్‌, విజయనగరం సిఐ బి.వెంకటరావు, డెంకాడ ఎస్‌ఐ కృష్ణమూర్తి ఉన్నారు.

➡️