ట్రాఫిక్కు నిబంధనలు పాటిస్తూ ఆటోలను నడపండి

Dec 6,2023 13:12 #Sri Satya Sai District
si awareness on traffic rules

ట్రాఫిక్ లో ఆటోలను జాగ్రత్తగా ఉండాలి
ప్రజాశక్తి-బత్తలపల్లి : వాహన రాకపోకలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా,ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రోడ్డు నిబంధనలను పాటిస్తూ ఆటోలను నడుపుకోవాలని బత్తలపల్లి ఎస్ఐ పీ. శ్రీనివాసులు సూచించారు. బుధవారం మండల కేంద్రమైన బత్తలపల్లి నాలుగురోడ్ల కూడలిలో ఎస్ఐ పి.శ్రీనివాసులు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబందనలుపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. బత్తలపల్లి మీదుగా అనంతపురం చెన్నై జాతీయ రహదారి ఉండడం, మండల కేంద్రంలో ఆర్డిటి ఆసుపత్రి ఉండడంవల్ల ప్రయాణికులు,రోగులురద్దీ, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆటో డ్రైవర్లు తమ ఆటోల వల్ల ఇతరులకు ఆటంకాలు, ఇబ్బందులకు గురికాకుండా తమ వాహనాలను నడుపుకోవాలని సూచించారు. ఆటోలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నవారు తమ సూచనలు హెచ్చరికలు విడచెవిన పెడితే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై ఉన్న మార్కులోపు వాహనాలను, ద్విచక్రవాహనాలను ఆపుకునేలా వాహనదారులకు సూచించారు.లేనిపక్షంలో జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. మొదటిసారిగా హెచ్చరిస్తామని అటు తరువాత మార్పురాని పక్షంలో చర్యలు తప్పవన్నారు. కొందరు ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. సీరియల్ వారీగా ఆటోలను ఆపుకుని, ఆర్టీసీ బస్సులకు ఆటంకాలు కల్పించకుండా ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లాలన్నారు. ఇష్టారాజ్యంగా కూడలిలో ఎక్కడబడితే అక్కడ ఆటోలలో ప్రయాణీకులను ఎక్కించుకొని ట్రాఫిక్కుకు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. ఆటోలలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసుకుని, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️