SBI: ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించలేం

  •  సమాచార హక్కు చట్టం దరఖాస్తును తిరస్కరించిన ఎస్‌బిఐ

న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించడానికి ఎస్‌బిఐ నిరాకరించింది. ఎన్నికల బాండ్లు విలువైన వ్యక్తిగత సమాచారం అని పేర్కొంటూ ఆర్‌టిఐ కింద వచ్చిన దరఖాస్తును ఎస్‌బిఐ తిరస్కరించింది. భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఎన్నికల బాండ్ల వివరాలను బహిరంగంగా ప్రజలకు ప్రకటించినా ఎస్‌బిఐ ఈ విధంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ఎన్నికల బాండ్ల స్కీమ్‌ ‘రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం’ అని పేర్కొంటూ వాటిని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న రద్దు చేసింది. ఏప్రిల్‌ 12, 2019 నుంచి ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పు తరువాత మార్చి 12 నుంచి ఎన్నికల బాండ్ల వివరాలను ఇసి వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ తరువాత అంటే మార్చి 13న ఆర్‌టిఐ కార్యకర్త లోకేష్‌ బాత్రా ఎన్నికల బాండ్ల పూర్తి సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో ఇవ్వాలని కోరుతూ ఎస్‌బిఐకి ఆర్‌టిఐ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును ఎస్‌బిఐ ఈనెల 10న తిరస్కరించింది. ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(ఇ), 8(1)(జె) కింద దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ‘మీరు కోరిన సమాచారం కొనుగోలుదారులు, రాజకీయ పార్టీలకు సంబంధించింది. కనుక ఇది వ్యక్తిగత సమాచారం కిందకు వస్తుంది. కాబట్టి బహిర్గతం చేయలేం. మీరు కోరిన దరఖాస్తుకు ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(ఇ), 8(1)(జె) కింద మినహాయింపు ఉంటుంది’ అని సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ బుధవారం సమాధానం ఇచ్చారు. ఎన్నికల బాండ్ల కేసులో ఎస్‌బిఐ తరుపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది హారీష్‌ సాల్వేకు చెల్లించిన ఫీజు వివరాలను కూడా బాత్రా కోరారు. దీనికి కూడా ఎస్‌బిఐ నిరాకరించింది. ఈ విషయాలను లోక్‌ష్‌ బాత్రా మీడియాకు వెల్లడించారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని ఇవ్వడానికి కూడా ఎస్‌బిఐ తిరస్కరించడం విచిత్రంగా ఉందని బాత్రా వ్యాఖ్యానించారు.

➡️