వసూలు చేసి..జమ చేయలేదు!

Feb 1,2024 09:57 #Rythu Bharosa Kendram
rythu bharosa kendram

 రూ.20 లక్షల వరకు బకాయిలు

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించిన ఎరువులు, సబ్సిడీ విత్తనాలకు సంబంధించి డబ్బులను రైతుల నుంచి వసూలు చేశారు. ఆ డబ్బులను ఆయా సంస్థలకు చెల్లించే విషయంలో మాత్రం ఉద్యోగులు కాలయాపన చేస్తున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో ఇలా చెల్లింపులు చేయని వారు అధికంగానే ఉన్నారు. చిన్న మొత్తాలుగానే కనిపిస్తున్నా ఈ ఘటన చిరుద్యోగుల పనితీరు ఏ విధంగా ఉందని చెప్పేందుకు నిదర్శనంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువులు, విత్తనాలు కొనుగోలు సమయంలో రైతులు ముందుగా డబ్బులు చెల్లించి తమకు అవసరమైనవి తీసుకుంటారు. వసూలు చేసిన ఈ డబ్బులను ఆయా సంస్థలకు వసూలు చేసిన విహెచ్‌ఎ (విలేజ్‌ అనిమల్‌ హాస్పండరీ అసిస్టెంట్లు) విఎస్‌ఎ(విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్లు) మరికొందరరు వారి వద్దనే ఉంచుకున్నారు. ఈ రకంగా చూస్తే 2023 సీజన్‌లో 29 రైతుభరోసా కేంద్రాల్లో కలిపి రూ.3.37 లక్షలు బకాయిలున్నాయి. ఇందులో రొళ్ల మండలంలోని గుడిగురికి రైతు భరోసా కేంద్రంలోనే రూ.1.16 లక్షల బకాయి ఉంది. తనకల్లు సదుంలో రూ.35 వేలు, కదిరి మండలం ఎగువపల్లిలో రూ.26 వేలు, నల్లచెరువు-2లో రూ.23 వేలు ఇలా బకాయిలు పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. మడకశిర మండలం మన్నూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నుంచి కూడా రూ.1.18 లక్షలు బకాయి ఉంది. విహెచ్‌ఎల నుంచి రూ.1.40 లక్షలు బకాయిలున్నాయి. రబీకి సంబంధించి మూడు రైతు భరోసా కేంద్రాల నుంచి రూ.94 వేలు బకాయిలున్నాయి. ఇవి కాకుండా ఇంకా 2022-23, 2023-24 కలిపి మొత్తం రూ.20 లక్షల వరకు విత్తనాలకు సంబంధించి బకాయిలు ఉన్నాయి. ఎరువులకు సంబంధించి కూడా పెద్దఎత్తునే బకాయిలున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లా బుక్కరాసయముద్రం మండల పరిధిలో పెద్ద మొత్తంలో డబ్బులను కాజేసి అడ్రసు లేకుండాపోయి ఉన్నాయి.

➡️