కదంతొక్కిన కష్ట జీవులు

rural bandh farmers protest against bjp policies
  • గ్రామీణ భారత్‌ బంద్‌, పారిశ్రామిక సమ్మె సక్సెస్‌
  • దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు, కార్మికులు
  • మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతామని ప్రతిన
  • జంతర్‌ మంతర్‌ వద్ద భారీ నిరసన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మోడీ ప్రభుత్వ ముదనష్టపు విధానాలపై దేశవ్యాపితంగా కార్మిక, కర్షక, శ్రామిక ప్రజానీకం పిడికిలెత్తింది. రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధరను చట్టబద్ధమైన గ్యారంటీ కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీకి అప్పగించడాన్ని ఆపాలని, కార్మికుల హక్కులను హరించే మూడు లేబర్‌ కోడ్‌లను వెనక్కి తీసుకోవాలని, వినాశకరమైన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలన్న నినాదాలు హోరెత్తాయి. ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా పారిశ్రామిక ప్రాంతంలోని వీధులను శ్రామిక మహిళలు ఆక్రమించారు.’భారత్‌ బంద్‌’ దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేసింది. రైతులు, రైతు కూలీలకు చెందిన వందలాది సంఘాల వేదిక కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం దేశంలోని 600కు పైగా జిల్లాల్లో గ్రామీణ భారత్‌ బంద్‌, పారిశ్రామిక సమ్మె అపూర్వమైన రీతిలో విజయవంతమైంది. సమస్త శ్రామిక వర్గం చేపట్టిన ఈ ఆందోళనకు బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్‌, రచయితలు, మేథావులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు ”నేషన్‌ ఫర్‌ ఫార్మర్స్‌” వేదిక వంటివి పూర్తి సంఘీభావాన్ని తెలిపాయి. లూథియానాలో హీరో సైకిల్‌ కార్మికులు కవాతు నిర్వహించారు.

గ్రామీణ భారతదేశం నిరసనలతో స్తంభించిపోయింది. కార్మికుల సమ్మెతో పరిశ్రమల సైరన్లు మూగబోయాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌ వంటి పలు ప్రాంతాల్లో కార్మికులు, రైతులు రోడ్డెక్కారు. హిమాచల్‌లోని సిమ్లా, మండిలో కార్మికులు, కర్షకులు కదం తొక్కారు. హర్యానాలోని పల్వాల్‌లో కార్మికులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆలిండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి బిజు కష్ణన్‌ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా కార్మికులు పెద్ద సంఖ్యలో రోడ్లను దిగ్బంధనం చేశారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరుతో ఈ ప్రాంతంలో రైతులనుంచి భూముల నుంచి పెద్దయెత్తున లాక్కొంది. న్యాయమైన పరిహారం కోసం వారు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ప్యారీ చౌక్‌ వద్ద రోడ్డు దిగ్బంధనంలో మహిళలు కూడా గణనీయమైన సంఖ్యలో పాల్గొన్నారు.

హర్యానాలోని పల్వాల్‌ లో ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ మాట్లాడుతూ, మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, శ్రామిక ప్రజలు దాదాపు ఏడాది పాటు ఢిల్లీ చుట్టూ కూర్చోవడంతో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. కనీస మద్దతు ధర కల్పించేచట్టం చేస్తామనిహామీ ఇచ్చింది. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలుకునోచుకోలేదు. అందుకే రైతులు, కార్మికులు మళ్లీ రోడ్డెక్కాల్సి వచ్చిందని అన్నారు. బోర్డు పరీక్షల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌, అస్సాంలో రైతులు, కార్మికులు ముందుగానే ఆందోళనలు నిర్వహించారు. మొదట జనవరి 26న దేశంలోని అన్ని జిల్లాల్లో రైతులు, కార్మికులు ట్రాక్టర్ల కవాతులో పాల్గొన్నారు. రాష్ట్రపతికి లేఖ పంపారు. కానీ ప్రభుత్వం చర్చించలేదు. మరోవైపు ఇదే డిమాండ్‌తో కొన్ని రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ అంటూ రోడ్డెక్కాయి. హర్యానాలో బిజెపి ప్రభుత్వం వారిపై బాష్పవాయువులు, లాఠీలు విసురుతోంది. యునైటెడ్‌ కిసాన్‌ మోర్చా కూడా నిరసనగా ప్రధానికి లేఖ పంపింది.

తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో కార్మికులు-రైతులు ర్యాలీలు నిర్వహించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జరిగిన ఊరేగింపులో పలువురు మహిళలు పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని ప్రెస్‌ కాలనీలో జమ్మూ కాశ్మీర్‌ యాపిల్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌, సీఐటీయూ సంయుక్తంగా నిరసన తెలిపాయి. పంజాబ్‌లోని లూథియానాలో హీరో సైకిల్స్‌ కార్మికులు రోడ్డెక్కారు.

లఖింపూర్‌ ఖేరీ మారణకాండకు ప్రధాన కుట్రదారు కేంద్ర హౌం సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీ మంత్రి పదవి నుంచి తొలగించి, విచారణ చేయాలని,  నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి)ని రద్దు చేయాలి. ఖనిజాలు, లోహాల తవ్వకాలపై ప్రస్తుత చట్టాన్ని సవరించాలని, స్థానిక సంఘాలు, ముఖ్యంగా ఆదివాసీలు, రైతుల అభ్యున్నతి కోసం బొగ్గు గనులతో సహా గనుల నుండి లాభంలో 50 శాతం వాటాను నిర్ధారించాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, జీవనోపాధికి సంబంధించిన అంశాలను జాతీయ ఎజెండాపైకి తీసుకురావాలని ప్రదర్శకులు నినదించారు.

మహారాష్ట్ర నాసిక్‌లోని పారిశ్రామిక ప్రాంతాల కార్మికులు దాదాపు అన్ని పారిశ్రామిక యూనిట్లలో భారీ సమ్మెలో చేరారు. ఉత్తర చెన్నై, కాంచీపురం, తమిళనాడులోని కంబాటోర్‌లోని ఎంఎన్సిలు, పవర్‌లూమ్స్‌, ఇంజనీరింగ్‌, ఎంఎస్‌ఎంఈలతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ మరియు ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ప్రధాన కర్మాగారాల్లోని పారిశ్రామిక కార్మికులు కూడా హౌల్డింగ్‌తో పాటు సమ్మెలో ఉన్నారు. కేరళలో రాజ్‌భవన్‌తో సహా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ సమీకరణలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బీహార్‌, హర్యానా, రాజస్థాన్‌, నాగాలాండ్‌, పంజాబ్‌ తదితర ఆరు రాష్ట్రాల్లో సమ్మెలో ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. బీమా, బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా తమ శాఖలు, కార్యాలయాల వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. ఇలా దేశమంతటా కార్మి కులు, రైతులు, శ్రామిక మహిళలు పెద్దయెత్తున ఉద్యమించారు. మోడీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు.

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌, ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా, ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం దావలే, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌ జిత్‌ కౌర్‌, సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక మోడీ సర్కార్‌ విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తూ మోడీ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. రైతులను, కార్మికులను దగా చేశారని విమర్శించారు..ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 పెంచాలని, పట్టణాలకు కూడా ఉపాధి హామీని విస్తరించాలని డిమాండ్‌ చేశారు. ఎఐఎడబ్ల్యుయు సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌, మహారాష్ట్రలోని ముంబాయిలో ఎఐకెఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ దావలే, సీనియర్‌ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ పాల్గొన్నారు.

➡️